ఉన్నది రాస్తే ఎదురుదాడి!

అధికార వైకాపాకు బంటుల్లాగా మారిపోయి గత అయిదేళ్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టం, వారి మాటే శాసనమన్నట్లుగా పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్‌ల తీరుపై కథనాలు రాస్తుంటే ఐపీఎస్‌ అధికారుల సంఘం దాడి చేస్తోంది.

Updated : 06 Apr 2024 09:56 IST

ఐపీసీని వదిలేసి వైసీపీని అనుసరిస్తున్నది నిజం కాదా?
వైకాపాతో అంటకాగడం వల్లే కదా.. ఒక ఐజీ అయిదుగురు ఎస్పీలపై వేటు పడింది!
ఏ తప్పూ చేయకుంటే ఈసీ ఎందుకు ఆగ్రహిస్తుంది?
గత అయిదేళ్లలో పోలీసు వేధింపుల బారినపడినవారు ఎందరో  
బాధితుల పైనే ఎదురు కేసులు పెట్టిన ఘనత మీది
ఐపీఎస్‌ అధికారుల సంఘం ప్రకటన దబాయింపు కాదా?

ఈనాడు, అమరావతి: అధికార వైకాపాకు బంటుల్లాగా మారిపోయి గత అయిదేళ్లుగా ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టం, వారి మాటే శాసనమన్నట్లుగా పనిచేస్తున్న కొంతమంది ఐపీఎస్‌ల తీరుపై కథనాలు రాస్తుంటే ఐపీఎస్‌ అధికారుల సంఘం దాడి చేస్తోంది. అవి నిరాధార, అసత్య ఆరోపణలంటూ దబాయిస్తోంది. పలువురు ఐపీఎస్‌ అధికారులపై ఈనాడులో ఇటీవల ప్రచురించిన కథనాలను ఖండిస్తూ ఐపీఎస్‌ అధికారుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ ఛాప్టర్‌ తరఫున.. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ హోదాలో విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొన్న అంశాలు ఆయన ఒక్కరి అభిప్రాయలా.. లేక సంఘం మొత్తానివా? సంఘం అభిప్రాయాలే అయితే దానిపై కీలకమైన ఆఫీస్‌ బేరర్ల సంతకాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


వైకాపాతో అంటకాగే అధికారుల తరఫున వకల్తా పుచ్చుకున్నారా?

కాంతిరాణా: పలువురు ఐపీఎస్‌ అధికారులపై నిరాధార, అసత్య ఆరోపణలతో కథనాలు ప్రచురించారు.
ఈ ప్రశ్నలకు బదులేది?: అసలు ‘ఈనాడు’ రాసిన ఏ కథనం, ఎలా నిరాధారమో చెప్పకుండానే.. అవి అసత్య ఆరోపణలని మీరెలా నిర్ధారించేస్తారు? మీరేమైనా వాటిపై విచారణ జరిపించారా? లేదంటే వైకాపాతో అంటకాగుతున్న కొందరు అధికారుల తరఫున మీరు వకల్తా పుచ్చుకున్నారా? అసలు ఏ ప్రాతిపదికన అవి నిరాధారమని మీరు తేల్చేశారు? అయిదేళ్ల పాటు వైకాపా సేవలో తరించింది చాలక.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా సరే ఆ పార్టీ పట్ల స్వామి భక్తి వీడకుండా ఏకపక్షంగా పనిచేయటం వల్లే కదా.. అయిదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వాళ్లు ఏ తప్పూ చేయకుండా, నిష్పక్షపాతంగా ఉండుంటే ఎందుకు ఈసీ ఆగ్రహానికి గురవుతారు? అలాంటి అధికారుల గురించి ఉన్నది ఉన్నట్లు రాస్తే అది అసత్యం ఎలా అవుతుంది? చివరికి బదిలీ అయిన అధికారుల స్థానంలో నియమితులైన నెల్లూరు, ప్రకాశం, అనంతపురం ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్‌, గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, అమిత్‌ బర్దర్‌లు వాళ్లు గతంలో పనిచేసిన జిల్లాల్లో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాయటం వాస్తవం కాదా? ప్రతిపక్షాలను అణచివేయటం నిజం కాదా? వాళ్లు వైకాపా పీనల్‌ కోడ్‌ను ఎంత బాగా అమలు చేశారో.. ఘటనలతో సహా రాసింది.. అవి నిజం కాదని చెప్పగలిగే ధైర్యం మీకుందా?


జగన్‌ పాదాల దగ్గర పోలీసు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేసి.. చట్టబద్ధమైన విధులు గురించి మాట్లాడటమా?

కాంతిరాణా: పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయటానికి, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో నిష్క్రియాత్మకంగా మార్చేయాలన్న లక్ష్యంతో అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?: కొంతమంది ఐపీఎస్‌లు తాము అఖిలభారత సర్వీసు అధికారులమని కూడా మరిచిపోయి అయిదేళ్లుగా వైకాపా కార్యకర్తల కంటే దారుణంగా పేట్రేగిపోతుంటే.. అది మీకెప్పుడు అవమానకరంగా అనిపించలేదా? కనిపించలేదా? ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో వైకాపా పీనల్‌ కోడ్‌, సీఆర్‌పీసీ బదులు వైకాపా ప్రొసీజర్‌ కోడ్‌ అమలు చేస్తున్నప్పుడు.. అసలు చట్టాలేంటో గుర్తుకురాలేదా? అధికార పార్టీకి భజన చేయటం.. ప్రతిపక్షాలను తొక్కేయటమే లక్ష్యమన్నట్లు పనిచేసి పోలీసుల ఆత్మగౌరవాన్ని, ప్రతిష్ఠను జగన్‌ కాళ్ల దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టేసిన కొందరి నుంచి చట్టబద్ధమైన విధుల నిర్వహణ అనే మాటలు రావటం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. అంతెందుకు విజయవాడలో తెదేపా నాయకుడు చెన్నుపాటి గాంధీపై వైకాపా నాయకులు హత్యాయత్నానికి తెగబడితే.. ఆ నిందితులపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు పెట్టి వారికి కొమ్ముకాసింది ఎవరు? తాజాగా నందిగామలో తెదేపా సానుభూతిపరులపై దాడి జరిగితే బాధితులైన వారిపైనే రివర్స్‌ కేసు పెట్టిన ఘనత ఎవరిది? రాష్ట్రంలో ప్రతిచోటా జరిగింది ఇదే కదా! పుంగనూరులో మరో తాలిబన్‌ రాజ్యాన్ని, మాచర్లలో చంబల్‌లోయను సృష్టించిన నాయకులకు అండగా ఉన్నది ఘనత వహించిన కొందరు పోలీసు అధికారులే కదా!


ప్రధాన ప్రతిపక్షాన్నే కలవనివారు.. సామాన్యులకు ఆ అవకాశమిస్తారా?

కాంతిరాణా: చట్టబద్ధమైన విధుల్లో భాగంగా పోలీసు శాఖ తీసుకునే చర్యల వల్ల ఎవరైనా వ్యక్తిగతంగా బాధపడితే.. వాళ్లు సంబంధిత అధికారుల వివరణ కోరొచ్చు. అప్పటికీ సంతృప్తి చెందకపోతే న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. దీనికి పోలీసు శాఖ తగిన రీతిలో సమాధానమిస్తుంది.
ఈ ప్రశ్నలకు బదులేది?: ఆంధ్రప్రదేశ్‌లో గత అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకుల నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, యువజన, రైతు సంఘాల ప్రతినిధుల వరకు.. చివరకు సామాన్య పౌరులు కూడా ఎంతోమంది పోలీసు వేధింపుల బారిన పడ్డారు. అసలు రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలవుతుందా? అనే అనుమానం వచ్చేలా బాధితుల పైనే వేలకొద్దీ అక్రమ కేసులు పెట్టారు కదా! దాడులకు తెగబడ్డ అధికార పార్టీ నాయకులను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకున్నారు కదా! అమరావతి రైతులు మొదలుకుని ప్రతి ఒక్కరిపైనా తీవ్ర అణచివేత, నిర్బంధం ప్రదర్శించారు. వాటిని చట్టబద్ధమైనా విధులు అంటారా? అసలు బాధితుల్ని ఎప్పుడైనా కలవడానికి, వాళ్లు గోడు చెప్పుకోవడానికి అవకాశమిచ్చారా? అసలు వేధించిందే మీరైతే.. ఇక ఎవరివద్ద చెప్పుకోవాలి? పోలీసు బాస్‌ అయిన డీజీపీ కె.వి.రాజేంద్రనాథరెడ్డి గత రెండేళ్లలో ఏ ఒక్కరోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకులకైనా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారా? దాదాపు రెండేళ్ల తర్వాత శుక్రవారం నాడు తమకు డీజీపీ దర్శనభాగ్యం కలిగిందని ప్రధాన ప్రతిపక్షం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. ఇక సామాన్యులు మీ దగ్గరకు రాగలరా? బాధితులు న్యాయపరంగా తగిన మార్గాన్ని ఎంచుకోవచ్చని చెబుతున్నారు.. పోలీసులపై ఎంతమంది బాధితులు కోర్టులను ఆశ్రయించగలరో సమాధానం చెప్పగలరా?


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని