మూడు నెలల్లో రూ.300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల విలువైన నగదు, వస్తువులు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Updated : 20 Apr 2024 05:43 IST

‘సీ-విజిల్‌’ ద్వారా 11,500 ఫిర్యాదులు
వాటిలో 99 శాతం పరిష్కరించాం
కోడ్‌ ఉల్లంఘించిన 1,017 మంది వాలంటీర్లను తొలగించాం
‘ఈటీవీ’ ముఖాముఖిలో సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా వెల్లడి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల విలువైన నగదు, వస్తువులు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. సీ-విజిల్‌ యాప్‌ ద్వారా గురువారం వరకు మొత్తం 11,500 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో దాదాపు 99 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించామని గురువారం ‘ఈటీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో ఆయన పేర్కొన్నారు. ‘నగదు, మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు ఇప్పటికే 500 స్టాటిక్‌ బృందాలు పనిచేస్తున్నాయి. మరో 1,500 బృందాలు ప్రత్యేకంగా ఈసీ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి పనిచేస్తాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని ఉల్లంఘించిన వ్యవహారంలో 1,017 మంది వాలంటీర్లను తొలగించాం. 86 కేసులు నమోదు చేశాం. 181 మంది ఒప్పంద ఉద్యోగులను విధుల నుంచి తప్పించాం. 40 కేసులు నమోదు చేశాం. 127 మంది రెగ్యులర్‌ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోగా.. 59 మందిని సస్పెండ్‌ చేశాం. 27 కేసులు నమోదు చేశాం. జిల్లాల్లో వచ్చే ఫిర్యాదులపైనా రాష్ట్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ఉన్నతాధికారులపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ తీసుకుని ఈసీకి నివేదించాం. వాటిని పరిశీలించి కమిషన్‌ తగునిర్ణయం తీసుకుంటుంది’ అని వెల్లడించారు.

ఓటింగ్‌ శాతం పెంచేందుకు కృషి..

‘గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 79శాతం ఓటింగ్‌ నమోదైంది. దాన్ని ఈసారి 83 శాతానికి పెంచేందుకు కృషిచేస్తున్నాం. అందుకు.. ఇతర ప్రాంతాల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. గిరిజన ప్రాంతాల్లో ఓటర్లను చైతన్యవంతం చేయడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాళ్ల దాడి ఘటనలు మా దృష్టికి వచ్చాయి. సీఎం, వీవీఐపీలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్రానికి వచ్చిన ప్రత్యేక పోలీసు పరిశీలకుడు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు’ అని మీనా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు