చేదోడని.. ‘చెయ్యిచ్చి’!

‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్‌ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్‌ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.

Updated : 06 May 2024 06:39 IST

4 లక్షల మంది నాయీబ్రాహ్మణుల్లో 40 వేల మందికే సాయం
పది లక్షల మంది రజకుల్లో లక్ష మందే అర్హులా?
దర్జీలకూ నామమాత్రంగా సాయం
‘చేదోడు’ ప్రయోజనం పది శాతం మందికే!
నిబంధనల పేరుతో అడ్డగోలు వడపోత
ఈనాడు, అమరావతి

2019 ఎన్నికల ముందు.. జగన్‌ ప్రకటించని పథకమంటూ లేదు.
అధికారంలోకి వచ్చాక.. వాటిలో అత్యధికం మరచిపోగా..
అమలుచేస్తున్న వాటిలోనూ లబ్ధిదారుల్ని రకరకాల నిబంధనలతో వడపోశారు.
‘చేదోడు’ పేరుతో.. వెనకబడిన కులాలైన
నాయీ బ్రాహ్మణులూ, రజకులకు చేయందిస్తానని మాటిచ్చి..
తర్వాత వివిధ కారణాలు చెప్పి చేయిచ్చారు..!

  • నగరాలు, పట్టణాల్లోని అపార్ట్‌మెంట్లలో వాచ్‌మెన్లుగా ఎక్కువగా రజక కుటుంబాలకు చెందినవారే ఉంటారు. అపార్ట్‌మెంట్‌లో ఉండేవారితోపాటు, చుట్టుపక్కల వారి దుస్తులు ఉతికి, ఇస్త్రీచేయడం ద్వారా కుటుంబాన్ని  పోషించుకుంటుంటారు. వీరంతా గ్రామాల నుంచి వలస వచ్చిన వాళ్లే. రిజిస్టర్‌ అయిన లాండ్రీ షాపు లేదనే సాకు చూపించి వీరిని ‘చేదోడు’కు అనర్హులుగా చెప్పారు.  
  • హెయిర్‌ కటింగ్‌ షాపుల్లో కొన్నిచోట్ల ఒకరికిమించి నాయీబ్రాహ్మణులు పనిచేస్తుంటారు. దుకాణ యజమాని ఒక్కరికే సాయం ఇస్తామంటూ.. మిగిలినవాళ్లు అసలైన పేదలైనా సరే వారికి ఇవ్వలేదు.
  • దుకాణం పెట్టుకునే స్తోమతలేని దర్జీలు ఎందరో..  ఇళ్ల దగ్గరే టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ‘చేదోడు’ కింద ప్రభుత్వం సాయం అందించడం లేదు. ఇదేమంటే ‘దుకాణం లేదు కదా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘దుకాణం లేకపోయినా ఇంటిదగ్గరే దుస్తులు కుడుతున్నా’నని, ‘దుకాణంలో టైలరింగ్‌ చేస్తున్నా.. కనికరించండి’ అని ఎందరో వేడుకున్నా..   కుదరదని నిర్దయగా చెప్పేశారు.

‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్‌ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్‌ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. గత ఎన్నికల సమయంలో నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలందరికీ ఆర్థిక సాయం చేసి ‘చేదోడు’గా నిలుస్తానని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక ‘షరతులు వర్తిస్తాయం’టూ భారీగా వడపోశారు. తమని     అర్హులుగా పరిగణించాలని ఆయా వృత్తిదారులు గ్రామ, వార్డు   సచివాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. అక్కడి ఉద్యోగులు తామేమీ చేయలేమని, ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో మీకు సాయం ఇవ్వలేమంటూ చెబుతున్నారు.

ఏ గ్రామం, పట్టణంలోనైనా రజక, నాయీబ్రాహ్మణ వృత్తులవారు ఎవరనేది అక్కడి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తెలుసు. వారంతా తమ వృత్తులపై ఆధారపడినా.. జగన్‌ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించకుండా మొండిచేయి చూపింది. ‘నాయీబ్రాహ్మణులకు, రజకులకు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తాం. వారికి తోడుగా ఉంటాం’ అని వైసీపీ 2019 మ్యానిఫెస్టోలో జగన్‌ ప్రకటించారు. తీరా వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చాక తన నిజస్వరూపాన్ని బయటపెట్టారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల రజక కుటుంబాలు ఉంటే.. ఏటా  సగటున లక్ష కుటుంబాలకే సాయం అందించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 4 లక్షల వరకు నాయీబ్రాహ్మణ కుటుంబాలు  ఆ వృత్తిలో కొనసాగుతుంటే.. అందులో ప్రతి సంవత్సరం సగటున 40 వేల మందికే పథకం వర్తింపజేశారు. అంటే రెండు వర్గాల్లోనూ పదిశాతం మందికే పథకం అందింది. ఇక లక్షల సంఖ్యలో దర్జీలు ఉంటే.. ఏటా సగటున 1.70 లక్షల మందికే సాయం చేశారు. ఇక్కడా లబ్ధిదారులు పదిశాతం లోపే. నిబంధనలు సడలిస్తే.. ఇంకా లక్షల కుటుంబాలకు పథకం వర్తిస్తుందని తెలిసినా.. జగన్‌ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించింది.


నిబంధనలతో అడ్డంగా కోత

‘చేదోడు’ లబ్ధిదారుల విషయంలో పలు నిబంధనలు అమలు చేసి.. వారి సంఖ్యను గణనీయంగా తగ్గించారు. మరే ఇతర పథకంలోనూ లబ్ధి పొందకూడదని, ఆరు నెలల విద్యుత్‌ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని.. అందులో నెలకు సగటున 300 యూనిట్లు దాటకూడదని, పట్టణంలో వెయ్యి చదరపు అడుగులపైన స్థలంలో ఇల్లు ఉండకూడదని, సాగు భూమి పదెకరాలలోపు ఉండాలని.. ఇలా పలు షరతులు వర్తింపజేశారు. దీంతో అత్యధిక మంది అర్హత పొందలేకపోయారు. నాయీ బ్రాహ్మణులకు సెలూన్‌, రజకులకు లాండ్రీ దుకాణం, దర్జీలకు షాపు తప్పనిసరిగా ఉండాలని, వీటికి కార్మికశాఖ రిజిస్ట్రేషన్‌తో కూడిన సర్టిఫికెట్‌ ఉండాలనే నిబంధన కారణంగా.. ఎక్కువ మందికి ఈ సాయం    అందకుండా పోయింది. ఆయా నిబంధనలు సడలించకుండా వైకాపా ప్రభుత్వం ఎందరికో అన్యాయం చేసింది.


వీళ్లు అర్హులు కారా జగన్‌!

  • పట్టణాలు, నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో వాచ్‌మన్‌గా ఉంటూ, రజక వృత్తిని చేసుకునేవాళ్లకు ‘చేదోడు’ లేకుండా చేశారు. తొలి ఏడాది కొందరికి ఇచ్చినప్పటికీ.. అపార్ట్‌మెంట్‌లో కాకుండా బయట ఎక్కడైనా దుకాణంగానీ, లాండ్రీ బండి గానీ ఉండాలనే షరతుపెట్టారు. దీంతో తర్వాత ఏడాది నుంచి అపార్ట్‌మెంట్లలో    వాచ్‌మెన్లుగా ఉండే వారికి సాయం దక్కకుండాపోయింది.
  • గ్రామాలూ, పట్టణాల్లో ఎక్కువ మంది రజకులు నదులు, చెరువులు, పంట కాల్వలు, ధోబీ ఘాట్లలో  ఉతికి, తమ ఇళ్ల వద్ద లాండ్రీ చేస్తారు. వీరిలో ఎక్కువ మందికి సొంత దుకాణం, బండి లేదనే సాకుతో సాయం ఇవ్వలేదు.
  • హెయిర్‌ కటింగ్‌ దుకాణాల్లో నాయీబ్రాహ్మణులు ఇద్దరు, ముగ్గురు పనిచేసినా.. ఆ దుకాణం      ఎవరి పేరిట రిజిస్ట్రేషన్‌ అయిందో, వారికి మాత్రమే సాయం అందించారు.
  • నగరాల్లో కటింగ్‌ దుకాణాల్లో ఏసీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ నాయీబ్రాహ్మణుడి ఇంటికి ఏసీ లేకపోయినా, తన దుకాణానికి ఎక్కువ మంది కస్టమర్లు వచ్చేలా ఏసీ సదుపాయం కల్పిస్తున్నారు. దీనివల్ల విద్యుత్‌ బిల్లు నెలకు సగటున 300 యూనిట్లు దాటితే.. పథకం నిలిపేస్తున్నారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఎందరో క్షురకులు దుకాణం ఏర్పాటు చేయకుండా.. ఇంటింటికి తిరిగి హెయిర్‌ కటింగ్‌ వంటివి చేస్తారు. వీరికి దుకాణం లేదనే కారణంతో పథకం వర్తింపజేయలేదు.
  • రెడీమేడ్‌ దుస్తుల హవా సాగుతున్న ఈరోజుల్లో  దర్జీలకు సరైన ఉపాధి లేకుండాపోయింది. ఇటువంటి దర్జీలకు అండగా నిలుస్తానన్న జగన్‌ ప్రభుత్వం అనేక ఆంక్షలతో వారికి చేదోడు పథకం దక్కనివ్వలేదు.
  • కొన్నిచోట్ల.. ఒక్కో దర్జీ దుకాణంలో ముగ్గురు, నలుగురు దుస్తులు కుడుతుంటారు. కానీ ఆ దుకాణం ఎవరి పేరిట ఉందో, అతడికి మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సాయం అందించారు. అందులో పనిచేసిన మిగిలిన వాళ్లు కూడా దర్జీలే అయినప్పటికీ, అర్హులైన పేదలే అయినాసరే ప్రభుత్వం వారిని పరిగణనలోకి తీసుకోలేదు.
  • ఎందరో దర్జీలు, మహిళలు ఇళ్ల వద్ద దుస్తులు కుట్టి కుటుంబాలను పోషిస్తున్నారు. వీరికి కూడా సొంత దుకాణం ఉన్నట్లు కార్మికశాఖ ధ్రువీకరణ పత్రం లేదనే కారణం చూపించి పథకం కింద ప్రయోజనం దక్కకుండా చేశారు.
  • అనేక కులాల వాళ్లు దర్జీ వృత్తిలో కొనసాగుతుంటారు. అయితే కొన్ని కులాల దర్జీలకు దుకాణం ఉన్నప్పటికీ.. ‘మీ కులానికి ఈవృత్తికి సరిపోవడం లేదం’టూ     అనర్హుల జాబితాలో పెట్టిన ఉదంతాలూ ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని