పదేళ్ల కనిష్ఠానికి విమాన ప్రయాణం

దేశీయంగా విమాన ప్రయాణికుల రాకపోకలు 2020-21లో 5.34 కోట్లుగా నమోదైందని, ఇది పదేళ్ల కనిష్ఠస్థాయి...

Published : 07 Apr 2021 00:55 IST

2020-21లో 5.34 కోట్లే: ఇక్రా

ముంబయి: దేశీయంగా విమాన ప్రయాణికుల రాకపోకలు 2020-21లో 5.34 కోట్లుగా నమోదైందని, ఇది పదేళ్ల కనిష్ఠస్థాయి అని రేటింగ్స్‌ సంస్థ ఇక్రా పేర్కొంది. కరోనా నియంత్రణకు విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలలు పాటు ప్రయాణికుల విమానాలు నిలిచిపోవడం, తదుపరి కూడా పరిమిత సామర్థ్యంతోనే సర్వీసులు నడపడం ఇందుకు కారణం. 2010-11లో దేశీయంగా 5.38 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు.
ఈ ఏడాది మార్చిలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 77- 78 లక్షలుగా ఉండొచ్చు. ఫిబ్రవరి నాటి 78.30 లక్షలతో పోలిస్తే గత నెలలో 1 శాతం తగ్గింది.
2020 మే 25 నుంచి 2021 మార్చి 31 మధ్య దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు 5.34 కోట్లుగా నమోదుకావొచ్చు. 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 62 శాతం తక్కువ.

కేపిటల్‌ మార్కెట్లే భారత వృద్ధికి ఇంధనం

దిల్లీ: భారత వృద్ధికి కేపిటల్‌ మార్కెట్లే ఇంధనంగా పనిచేస్తున్నాయని, కొవిడ్‌ సమయంలోనూ ఇది రుజువైందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు ఉదయ్‌ కోటక్‌ అన్నారు. మున్ముందూ ఈ ధోరణి కొనసాగేలా చూడాల్సిన అవసరాన్ని విధానరూపకర్తలు దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు.  వ్యాపారాలను తిరిగి గాడిన పెట్టేందుకు అత్యంత అవసరమైన సమయంలో నిధుల సమీకరణకు ఇవి ఉపయోగపడ్డాయని కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమిట్‌లో ఉదయ్‌ కోటక్‌ అన్నారు. కార్పొరేట్‌ పరిపాలనపై దృష్టి పెడితేనే నిధులు సమీకరించగలమని ఆయన పేర్కొన్నారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టాలంటే మంచి పరిపాలన తప్పనిసరని హెచ్‌డీఎఫ్‌సీ సీఈఓ కేకీ మిస్త్రీ అన్నారు.  

సంక్షిప్తంగా..

గ్రామీణ ప్రాంతాల వరకూ సరకు సరఫరా చేయడానికి 2030 నాటికి 25,000కు పైగా విద్యుత్‌ వాహనాలు వినియోగించేందుకు  మహీంద్రా లాజిస్టిక్స్‌, ఫ్లిప్‌కార్ట్‌ జట్టు కట్టాయి.
కొత్త తరం రంగాల్లోకి విస్తరించడానికి రట్టన్‌ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన పేరును రట్టన్‌ఇండియా ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చుకుంది. దీనికి ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు ఆమోదం తెలిపాయి.
రూ.800 కోట్ల నిధుల సమీకరణ కోసం శ్రీరామ్‌ ప్రోపర్టీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) వచ్చేందుకు ముసాయిదా పత్రాల్ని సెబీకి ఈ వారంలో దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
స్కోడా ఆటో తమ నాలుగో తరం ఆక్టేవియా సెడాన్‌ ఉత్పత్తిని మహారాష్ట్రలోని ఔరంగదాబాద్‌ తయారీ ప్లాంట్‌లో ప్రారంభించినట్లు తెలిపింది.
ఆధునికీకరించిన వెర్షన్‌ ఎఫ్‌-పేస్‌ ఎస్‌యూవీకి బుకింగ్‌లు ప్రారంభించినట్లు జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వెల్లడించింది.
కొవిడ్‌-19తో కుదేలైన ఎయిర్‌ ఫ్రాన్స్‌ విమానయాన సంస్థకు 4.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.35,000 కోట్లు) సాయం అందించేందుకు ఐరోపా సమాఖ్య ఆమోదం తెలిపింది.
దేశీయ ఇంధన దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అంతర్జాతీయ ఇంధన సంస్థలు, పారిశ్రామిక సంస్థలు సంయుక్తంగా కొత్త ఇంధన పరివర్తన కూటమిని మంగళవారం ఏర్పాటు చేశాయి. దీనికి ఇండియా హెచ్‌2 అలియన్స్‌ (ఐహెచ్‌2ఏ) అనే పేరును ఖరారు చేశాయి. హైడ్రోజన్‌ టెక్నాలజీలను వాణిజ్య ప్రాతిపదికన అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి.
భారతీయ కంపెనీలు 2020-21లో బీఎస్‌ఈ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా రూ.18.56 లక్షల కోట్లకు పైగా నిధుల్ని సమీకరించాయని, అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 53 శాతం అధికమని ఎక్స్ఛేంజీ వెల్లడించింది.
కొత్త దిగుమతిదార్లు, ఎగుమతిదార్లు, కస్టమ్స్‌ బ్రోకర్లకు గుర్తింపు ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పాన్‌, ఆధార్‌తో పాటు వ్యాపార స్థల భౌతిక ధ్రువీకరణ వంటివి పరిశీలిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని