క్యాడ్బరీపై సీబీఐ కేసు నమోదు

క్యాడ్బరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (మాండెల్జ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) అవినీతికి పాల్పడిందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసు నమోదు చేసిందని ఆంగ్ల పత్రిక ఎన్‌డీటీవీ పేర్కొంది.

Published : 18 Mar 2021 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్యాడ్బరీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (మాండెల్జ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) అవినీతికి పాల్పడిందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసు నమోదు చేసిందని పీటీఐ వార్తసంస్థ పేర్కొంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని బడ్డీ వద్ద పన్ను లబ్ధిలను పొందడానికి వాస్తవాలను దాచిందని సీబీఐ ఆరోపించింది. దీంతో హరియాణ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఐదు ప్రదేశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ నేడు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించింది. కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకొంది.  సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లోని అధికారులతో కుమ్మక్కై హిమాచల్‌ ప్రదేశ్‌లోని యునిట్‌కు రూ.241 కోట్లు విలువైన పన్ను లబ్ధిని పొంది. ఈ ఫ్యాక్టరీలో 5స్టార్‌, జెమ్స్‌ తయారు చేస్తారు. ఈ మొత్తం వ్యవహారం 2009-2011 మధ్య జరిగిందని అధికారులు చెబుతున్నారు.  ఈ వ్యవహారంలో ఇప్పటికే స్వాధీనం చేసుకొన్న ఆధారాలతో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. క్యాడ్బరీ పన్నుఅధికారులతో కుమ్మక్కై తప్పుడు రికార్డులు సమర్పించి, కొన్ని రికార్డులను తారుమారు చేసి  ప్రాంతాల వారీగా లభించే రాయితీలను పొందినట్లు తేలింది. 

2007లో హిమాచల్‌ ప్రదేశ్‌లోని బడ్డీ ప్రాంతంలో ఒక కర్మాగారం ఏర్పాటు చేసి మరో 10 ఏళ్ల అదనంగా సుంకాలు, పన్నురాయితీలు పొందేలా ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత కొత్త యూనిట్‌ నిర్మించకుండా.. 2005 నుంచి ఉన్న కర్మాగారాన్నే కొంత మేరకు విస్తరించింది.  ఇక 2010 జులైలో రెండో యూనిట్‌కు లైసెన్స్‌ తీసుకొంది. పన్న రాయితీలు పొందడానికి విధించిన గడువు ముగిసి అప్పటికే నాలుగు నెలలు దాటిపోయింది. అంతేకాదు.. ఆ రెండో యూనిట్‌ పన్నురాయితీలు పొందడానికి ఏమాత్రం అర్హత లేదు. ఈ దశలో సెంట్రల్‌  ఎక్సైజ్‌ అధికారి నిర్మల్‌ సింగ్‌, జస్ప్రీత్‌ కౌర్‌లకు మధ్యవర్తుల ద్వారా లంచాలను ఇచ్చి రూ.241కోట్ల మేరకు పన్ను రాయితీలను పొందింది. ఈ క్రమంలో రికార్డుల తారుమారు, లంచాలు వ్యవహారం నడిచిందని సీబీఐ పేర్కొంది. దీనిపై మాండెల్జ్‌ ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ స్పందిస్తూ.. పన్నువివాదాలను 2019లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ స్కీమ్‌ ద్వారా పరిష్కరించుకొన్నట్లు పేర్కొంది. 

ఇవీ చదవండి

అమెరికా చమురే ఎందుకు..

ఏడాదిలోగా టోల్‌ప్లాజాలు తొలగిస్తాం

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని