Automobile: డిసెంబరు అమ్మకాల్లో వేగనార్‌ దూకుడు.. టాప్‌ 10లో మారుతి సుజుకీ హవా!

ఆటోమొబైల్‌ అమ్మకాల్లో మారుతి సుజుకీ మరోసారి నెంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. డిసెంబరు నెలలో అమ్ముడైన టాప్‌ 10 కార్లలో ఎనిమిది మోడల్స్‌ మారుతివే కావడం గమనార్హం. 

Updated : 07 Jan 2022 20:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గడిచిన ఏడాదిలో కరోనా మహమ్మారి ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. చిప్‌ల కొరత వల్ల ఉత్పత్తి మందగించడంతో కొత్తగా కారు కొనేవారు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కూడా పరోక్షంగా అమ్మకాలపై ప్రభావం చూపాయి. అయితే ఏడాది చివరి నెల అమ్మకాల్లో మారుతి సుజుకీ దూకుడును ప్రదర్శించగా, టాటా మోటార్స్‌, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సంస్థలు ఫర్వాలేదనిపించాయి. ఈ మేరకు జాటో డైనమిక్స్‌ ఇండియా అనే సంస్థ 2021 డిసెంబరులో అమ్ముడైన కార్లలో టాప్‌ 10 కార్ల జాబితాను విడుదల చేసింది. మొత్తం పది కార్లలో ఎనిమిది మారుతి సుజుకీ మోడల్స్‌ కావడం గమనార్హం. అలానే తొలి ఐదు కార్ల జాబితాలో నాలుగు మారుతి సుజుకీవి కాగా, ఒకటి టాటా మోటార్స్‌కు చెందినది. తర్వాతి ఐదు స్థానాల్లో ఒకటి హ్యుందాయ్‌ మోడల్‌ కాగా, మిగిలిన నాలుగు మారుతి సుజుకీ మోడల్స్‌ ఉన్నాయి. మరి ఆ మోడల్స్ ఏంటి.. వాటి అమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 

* మారుతి సుజుకీ సంస్థకు చెందిన వేగనార్‌ మోడల్‌ డిసెంబరు నెల అమ్మకాల్లో మొదటి స్థానంలో ఉంది. నవంబరు నెలలో మొత్తంగా 16,853 వేగనార్ మోడల్స్‌ అమ్ముడైతే, డిసెంబరులో వేగనార్‌ అమ్మకాల సంఖ్య 19,729కు చేరింది. 

* ఇదే సంస్థకు చెందిన స్విఫ్ట్‌, బాలెనో మోడల్స్‌ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. నవంబరులో 14,568 స్విఫ్ట్‌ కార్లు అమ్ముడవ్వగా, డిసెంబరులో 15,661 మోడల్స్‌ అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. అదేవిధంగా 14,458 బాలెనో మోడల్స్‌ డిసెంబరులో అమ్ముడయ్యాయని నివేదికలో పేర్కొంది. 

* టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్ మోడల్‌ 12,899 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో స్థానంలో మారుతి సుజుకీ ఎర్టిగా మోడల్ నిలిచింది. డిసెంబరులో నెలలో 11,840 ఎర్టిగా కార్లు అమ్ముడైనట్లు జాటో డైనమిక్స్ సంస్థ తెలిపింది. 

* 13,812 యూనిట్ల అమ్మకాలతో నవంబరు నెల టాప్‌ 10 జాబితాలో మూడో స్థానంలో ఉన్న మారుతి సుజుకీ ఆల్టో, డిసెంబరులో 11,170 యూనిట్ల అమ్మకాలతో ఆరో స్థానానికి పరిమితమైంది. 10,663 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకీ  డిజైర్‌ ఏడు, 10,360 యూనిట్ల అమ్మకాలతో హ్యుండాయ్‌ వెన్యూ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. 

* తొమ్మిదో స్థానంలో 9,531 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకీ విటారా బ్రెజా ఎస్‌యూవీ మోడల్‌ ఉండగా, 9,165 యూనిట్ల అమ్మకాలతో మారుతి సుజుకీ ఈకో వ్యాన్‌ పదో స్థానంలో ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని