Del Vecchio: ఈ ‘రే బన్‌’ రారాజు జీవితం ఓ ‘కన్ను’లపండుగ

ప్రపంచ ప్రఖ్యాత ఐవేర్‌ కంపెనీ లక్సొట్టికా వ్యవస్థాపకుడు లియోనార్డో డెల్‌ వెచియో. ఒకప్పుడు అన్నం కోసం అలమటించిన ఆయనే ఇప్పుడు ఇటలీలో రెండో అత్యంత ధనవంతుడిగా.. ప్రపంచంలో 64వ శ్రీమంతుడిగా కొనసాగుతున్నారు....

Updated : 29 May 2022 11:13 IST

ఆనాడు అమ్మ ఉన్న అనాథ.. నేడు కోట్ల కళ్లకు రక్షణ ప్రదాత

ఇంటర్నెట్‌ డెస్క్‌: 1930ల్లో ఇటలీలోని ఓ నిరుపేద కుటుంబంలో ఓ తల్లి మగబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రి కూరగాయలమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. కానీ, నాన్నను చూసే భాగ్యం ఆ పిల్లోడికి కలగలేదు. ఐదు నెలల క్రితమే ఆయన మరణించాడు. కుటుంబంలో ఆ బాలుడు ఐదో సంతానం. తల్లికి భయమేసింది. అందరినీ ఎలా పోషించాలో అర్థం కాలేదు. చిన్న చితకా పనులు చేసుకుంటూ ఏదోలా నెట్టుకొచ్చింది. కానీ, ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు.

అమ్మ ఉన్నా.. అనాథగా..

ఆ బాలుడికి ఏడేళ్లొచ్చిన తర్వాత తల్లి తొలిసారి అతణ్ని చాలా దూరం తీసుకెళ్లింది. రోడ్డు వెంట కార్లు, భవనాలు చూసి ఆ కుర్రాడు మురిసిపోయాడు. తల్లి మాత్రం ఏడుస్తూ ఉంది. చివరకు ఓ పెద్ద భవనంలోకి తీసుకెళ్లింది. కన్నీరుతోనే నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంత సమయం గడిచిన తర్వాతగానీ ఆ బాలుడికి అసలు విషయం బోధపడలేదు. పోషించే స్తోమత లేక తన తల్లి తనని అనాథాశ్రమంలో వదిలేసిందని. అమ్మ ఉండగానే అనాథలా బతకాల్సి రావడం అతణ్ని కుంగదీసింది. కొంతకాలం తర్వాత అదే అతనిలో పట్టుదలను పెంచింది.

ప్రపంచ శ్రీమంతుల్లో ఒకడిగా..

ఇప్పుడతనికి 86 ఏళ్లు. కన్నీటితో బాల్యాన్ని గడిపిన ఆయనే ఇప్పుడు కంటికి రక్షణగా నిలిచే కళ్లద్దాలకు మారుపేరుగా మారారు. కేవలం కంటి లోపాలకు మాత్రమే వాడే కళ్లజోడుని ఫ్యాషన్‌ ప్రపంచంలోకి తీసుకెళ్లి పరిశ్రమ రూపురేఖల్నే మార్చేశారు. ఆయనే ప్రపంచ ప్రఖ్యాత ఐవేర్‌ కంపెనీ లక్సొట్టికా వ్యవస్థాపకుడు లియోనార్డో డెల్‌ వెచియో. ఒకప్పుడు అన్నం కోసం అలమటించిన ఆయనే ఇప్పుడు ఫోర్బ్స్‌ రియల్‌టైం బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం 27 బిలియన్‌ డాలర్ల సంపదతో ఇటలీలో రెండో అత్యంత ధనవంతుడిగా.. ప్రపంచంలో 50వ శ్రీమంతుడిగా కొనసాగుతున్నారు.

ఫ్యాషన్‌ ప్రపంచానికి కళ్లద్దాల పరిచయం..

అనాథాశ్రమంలో ఉండగానే.. 14 ఏళ్ల వయసులో కళ్లద్దాల ఫ్రేములు తయారు చేసే ఓ చిన్న ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు డెల్‌ వెచియో. నైపుణ్యంలేక చేరిన కొన్ని రోజులకే మెషీన్‌లో చేతివేలు తెగిపడింది. పని మానేద్దామనుకున్నాడు. కానీ, వేరే మార్గంలేక తిరిగి అదే పనిలో చేరాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత కళ్లద్దాలపై ఆసక్తి పెరిగింది. వీటిని ఫ్యాషన్‌గానూ ధరించవచ్చని గుర్తించాడు. వాటి డిజైన్‌పై పట్టు సాధించాలని సంకల్పించి ఫైన్‌ఆర్ట్స్‌ అకాడమీలో రాత్రిపూట తరగతులకు హాజరయ్యేవాడు. అలా కళ్లద్దాల తయారీ, డిజైన్‌పై ప్రావీణ్యం సంపాదించాడు.

అలా మలుపు తిరిగి..

పనిచేస్తున్న సమయంలో పొదుపు చేసుకున్న డబ్బుతో ఓ చిన్న కంపెనీని స్థాపించారు డెల్‌ వెచియో. ఆరేళ్ల పాటు కష్టాలు తప్పలేదు. కానీ, నిష్క్రమించలేదు. కొంతకాలం తర్వాత వ్యాపారం నెమ్మదిగా పుంజుకుంది. 1988లో ఫ్యాషన్‌ డిజైనర్‌ జార్జియో అర్మానీకి కళ్లద్దాలు తయారు చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఆ కంపెనీ స్టార్‌ తిరిగింది. ప్రఖ్యాత సంస్థలన్నీ లక్సొట్టికాకు క్యూ కట్టాయి.

రే-బన్‌ సహా ప్రముఖ కంపెనీలన్నీ ఆయన పరం..

1990లో లక్సొట్టికా పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లింది. వచ్చిన నిధులతో ఆ రంగంలోని ఇతర కంపెనీలు, రిటైల్‌ స్టోర్లను కొనడం ప్రారంభించారు వెచియో. రే-బన్‌, పెర్సోల్‌, ఓక్లే సహా సన్‌గ్లాస్‌ రిటైలర్‌ హట్‌, ఆప్టీషియన్‌ చైన్‌ లెన్స్‌క్రాఫ్టర్స్‌ అన్నీ లక్సొట్టికా అధీనంలోకి వెళ్లిపోయాయి. ఛానెల్‌, రాల్ఫ్‌ లారెన్‌, ప్రడా, టిఫనీ, వర్సేస్‌ వంటి పెద్ద పెద్ద బ్రాండ్లకు కూడా ఈ కంపెనీయే అద్దాలను అందిస్తోంది.

ఆయన విజయం కొత్తపాఠం..

2018లో తన ఫ్రేమ్‌ తయారీ కంపెనీ అయిన లక్సొట్టికాను ఎసిలార్‌లో విలీనం చేయడంతో కంపెనీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. దీంతో బిలియన్‌ డాలర్ల కళ్లద్దాల తయారీ కంపెనీగా ఎసిలార్‌లక్సొట్టికా అవతరించింది. ఆరు దశబ్దాల వెచియో విజయగాథ వ్యాపార ప్రపంచానికి కొత్త పాఠం నేర్పింది. ఓ వస్తువు తయారీలోని ప్రతి దశ ఒకే కంపెనీ చేతిలో ఉండడం వల్ల నాణ్యత విషయంలో రాజీ ఉండదని నిరూపించింది. ఇప్పుడు ఎసిలార్‌లక్సొట్టికా ముడిసరకుల దగ్గర నుంచి తుది ఉత్పత్తి బయటకొచ్చే వరకు ప్రతి వస్తువును ఆ కంపెనీయే చూసుకుంటుంది. ఏ దశలోనూ నాణ్యత తగ్గకుండా జాగ్రత్తపడుతోంది.

ఇది సినిమా కథ కాదు..

అన్నం కోసం అనాథాశ్రమంలో చేరడం.. పట్టుదలతో పైకి రావడం.. వేలాది మందికి ఉపాధి కల్పించే పెద్ద కంపెనీని ఏర్పాటు చేయడం.. ఆ రంగంలో సాటిలేని వ్యక్తిగా నిలవడం.. ఇదంతా ఏ నవలలోనో, సినిమాలోనో చూసినట్లు ఉంది కదా! బహుశా అలాంటి సినిమాలన్నీ వెచియో వంటి వ్యక్తుల జీవితాల ఆధారంగానే రూపొందిస్తారేమో. కన్నీటితో ప్రారంభమైన తన జీవిత పోరాటం చివరకు కోట్లాది మంది కళ్లకు రక్షణగా నిలిచే స్థాయికి చేరింది. 87 ఏళ్ల వయసులోనూ సంస్థ సీఈఓ, ఛైర్మన్‌గా వెచియో ఇప్పటికీ క్రియాశీలక పాత్ర పోషిస్తుండడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని