సూచీమాత్రమైనా లాభాల్లేవు

స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరుల్లో ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎన్నో రెట్లు అధికంగా లాభాలు సాధించాలని రంగంలోకి దిగుతారు.

Published : 26 Mar 2023 01:48 IST

స్టాక్‌మార్కెట్లో 67% మంది మదుపర్ల పరిస్థితి ఇదే
‘శామ్‌కో’ అధ్యయనంలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మదుపరుల్లో ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ఎన్నో రెట్లు అధికంగా లాభాలు సాధించాలని రంగంలోకి దిగుతారు. ‘మల్టీ బ్యాగర్స్‌’ వెంట పడతారు. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసి ఏళ్ల తరబడి ఎదురు చూస్తారు కానీ, షేర్ల మీద మాత్రం రోజుల్లో, నెలల్లోనే రెట్టింపు లాభాలు... లేదా రెండు, మూడు రెట్లు అధికంగా లాభం రావాలని ఆశపడతారు. కానీ ఎక్కువ మంది నష్టాల్లో మునిగిపోతున్నారనేది వాస్తవం. కొంతమంది నామమాత్రపు లాభాలతో సరిపెట్టుకోవలసి వస్తుంది. కనీసం నిఫ్టీ 50 సూచీ లేదా ప్రామాణిక సూచీ(బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌) మీద వచ్చిన ప్రతిఫలం కూడా ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు లభించడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కారణాలెన్నో..: స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న మదుపరుల్లో దాదాపు 67 శాతం మంది బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ ప్రతిఫలాన్ని సైతం చేరుకోలేకపోతున్నారని శామ్‌కో సెక్యూరిటీస్‌ నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. తప్పుడు సలహాల (టిప్స్‌)  మీద ఆధారపడటం, దురాశ, భయం, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవటం, ట్రేడింగ్‌ తప్పులు దీనికి ప్రధాన కారణాలని ఈ సంస్థ వివరించింది. మరికొన్ని అంశాలు ఈ అధ్యయనంలో వెల్లడయ్యాయి.

* స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడిదార్లలో 67 శాతం మంది సూచీల్లో వచ్చిన ప్రతిఫలం స్థాయిని అందుకోలేకపోతున్నారు.

* స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులపై ఏ మేరకు లాభాలు వస్తాయి? అనే అంశంపై 65 శాతం మంది మదుపరులకు సరైన అవగాహన లేదు.

* కనీసం ప్రామాణిక సూచీ ఇచ్చే లాభాల స్థాయిని అందుకోవాలనే ఆలోచన కూడా 77 శాతం మందిలో ఉండడం లేదు.

* ‘బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ రిటర్న్‌’పై 23 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ, ఆ లాభాలు ఎలా వస్తాయి, దాన్ని ఎలా అందుకోవాలి- అనే విషయం ఈ 23 శాతం మందిలో సగం మందికి తెలియడం లేదు.

* స్పష్టమైన పెట్టుబడుల లక్ష్యం లేదా సూచీల్లో వచ్చే ప్రతిఫలాన్ని అధిగమించాలనే ప్రణాళిక 63 శాతం మందికి ఉండటం లేదు.
ఈ పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియో నిర్మాణం, నిర్వహణ, బెంచ్‌మార్క్‌ సూచీలను అందుకోవటంలో మదుపరులకు తగిన  అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు శామ్‌కో సెక్యూరిటీస్‌ వివరించింది. మదుపరులు సొంతంగా సూచీలకు మించిన లాభాలను నమోదు చేయలేని పక్షంలో తమ పెట్టుబడుల నిర్వహణ బాధ్యతను నైపుణ్యమున్న ఫండ్‌ మేనేజర్లకు అప్పగించటం మేలని, లేదా ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని ఈ నివేదిక సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు