Gold Loans: ఎలాంటి అవసరాలకు బంగారు రుణాన్ని ఉపయోగించుకోవచ్చు?

మీ ఆర్థిక అవసరాలను తీర్చగల అనేక విభిన్న రుణ ఎంపికలు మార్కెట్లో ఉన్నప్పటికీ బంగారంపై రుణం తీసుకోవడమన్నది సురక్షితం. ఈ రుణాలకు వడ్డీ తక్కువ ఉండడమే కాకుండా వేగంగానూ లభిస్తుంది.

Published : 06 May 2024 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఆభరణంగానే కాకుండా.. కష్ట సమయాల్లో మనుషులకు సరైన ఆర్థిక మార్గం కూడా చూపెడుతుంది. ప్రణాళికబద్ధంగా జీవించేవారు సైతం ఆర్థికంగా ఎంత ప్లాన్‌ చేసుకున్నా ఒక్కోసారి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలు తీర్చగల గొప్ప సాధనం బంగారం. అత్యవసర అవసరాల కోసం.. వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసమే కాకుండా ఇంకా అనేక అవసరాల కోసం తక్కువ వడ్డీ రేట్లతో బంగారంపై రుణాన్ని తీసుకోవచ్చు. ఈ రుణాలు సురక్షిత రుణాలు కాబట్టి, వేగంగా మంజురై.. నిర్దిష్ట ఆర్థిక అవసరాలను తీరుస్తాయి. బంగారు రుణాన్ని ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ మంజూరుకు డాక్యుమెంట్స్‌ అవసరం కూడా చాలా తక్కువ. ఈ రుణాన్ని ఏయే అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చో ఇక్కడ చూద్దాం..

వ్యక్తిగత రుణం, ఊహించని ఖర్చులు

ప్రతి ఒక్కరికీ  వ్యక్తిగత అవసరాలు చాలానే ఉంటాయి. వారి ఆర్థిక బాధ్యతలకు సరిపడా ఆదాయం లేనప్పుడు వ్యక్తిగత రుణం తీసుకోవడం తప్పదు. కానీ, వారికుండే వ్యక్తిగత ఇబ్బందులు, క్రెడిట్‌ ప్రొఫైల్‌ రీత్యా రుణం లభించకపోవచ్చు. రుణ సంస్థలు కూడా అనేక కారణాల వల్ల ఒక్కోసారి రుణాన్ని ఇవ్వకపోవచ్చు. ఇటువంటి వారికి బంగారు రుణం ఒక వారధిగా పనిచేసి, తక్షణ అవసరాలు వెంటనే తీరేలాగా చేస్తుంది. జీవితం అనూహ్యమైంది..ఏ సమయంలోనైనా, ఎవరికైనా ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు. ఇటువంటి సమయాల్లో బంగారాన్ని కలిగి ఉంటే, దానిపై రుణం తీసుకుని తక్షణ ఆర్థిక ఉపశమనం పొందొచ్చు.

వైద్య ఖర్చులు

కొన్నిసార్లు అత్యవసరంగా అనారోగ్య పరిస్థితులు కుటుంబ సభ్యులకు ఎవరికైనా ఏర్పడవచ్చు. తగిన ఆరోగ్య బీమా ఉంటే పర్వాలేదు. లేని సందర్భంలో ఆసుపత్రుల బిల్లులు చెల్లించడానికి తగినంత డబ్బులు చాలా మంది వద్ద ఉండకపోవచ్చు. అప్పు కూడా కొద్ది సమయంలో దొరకని పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో బంగారంపై రుణాన్ని తీసుకుని అనారోగ్య పరిస్థితుల నుంచి గట్టెక్కవచ్చు. వ్యక్తులకు ఆలస్యం కాకుండా అవసరమైన వైద్య సంరక్షణను పొందేలా ఈ రుణం ఉపయోగపడుతుంది.

వ్యాపార అభివృద్ధి

ఉద్యోగాలు చేసేవారితో పోలిస్తే, వ్యాపారాలు చేసేవారికి నగదు అవసరాలు భారీగానే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వ్యాపారవేత్తలు తక్కువ సమయంలో తమ వ్యాపార అభివృద్ధి కోసం నిధులకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తారు. వడ్డీ వ్యాపారుల వద్ద నిధులు లభించినా.. వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో రుణం ఆశించేవారు బంగారంపై రుణాన్ని పొందడం ఒక మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. కొన్నిసార్లు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి తగినంత నగదు ఉండకపోవచ్చు. ఉదాహరణకు.. కిరాణా దుకాణం, పార్లర్‌, బోటిక్‌, జిమ్‌, కేఫ్‌, సెకండ్‌హాండ్‌ వాహన డీలర్‌షిప్‌ కావచ్చు. ఇంట్లోనే వ్యాపారాన్ని ప్రారంభించే నైపుణ్యాలు ఉన్నప్పటికీ మూలధనం లేని మహిళల విషయంలో ఇది తరచుగా జరుగుతుంది. ఇటువంటివారు బంగారంపై రుణాన్ని తీసుకోవడం మంచిది. తక్కువ వడ్డీతో రుణాన్ని తీసుకుని వ్యాపారంలో మెరుగైన ఆర్థిక లబ్ధిని పొందొచ్చు.

విద్యా ఖర్చులు

గతంతో పోలిస్తే విద్యకు ప్రతి కుటుంబం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. విద్యపై పెట్టుబడి అంటే భవిష్యత్‌పై పెట్టుబడి పెట్టడమే. ట్యూషన్‌ ఫీజులు, స్టడీ మెటీరియల్స్‌ మొదలగు వాటికి నిధులు చాలా అవసరం. ప్రస్తుతం ప్రతి విద్యా కోర్సు ఖర్చుతో ముడిపడి ఉన్నదే. కొన్నిసార్లు..తగిన గ్యారెంటర్‌, మంచి క్రెడిట్‌ ప్రొఫైల్‌ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల రుణం ఆశించేవారికి విద్యా రుణాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటువంటి వారు బంగారంపై రుణాన్ని తీసుకోవడం సరైనదే. ఈ రుణంపై అనేక అనువైన రీపేమెంట్‌ ఎంపికలు ఉన్నాయి.

వివాహం

భారత్‌లో వివాహం అంటేనే చాలా ఖర్చుతో ముడిపడి ఉన్నది. ప్రత్యేకించి వివాహా ఖర్చులకు అన్ని వర్గాలకు రుణసంస్థలు రుణం ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలవారికి ఇలాంటి బ్యాంకు రుణాలు లభించడం ఇబ్బందే. ఇలాంటి వారు బంగారాన్ని తాకట్టుగా పెట్టి తక్కువ వడ్డీకే రుణం తీసుకోవడం ఉత్తమం. తమకు ఇష్టమైన బంగారాన్ని తాకట్టుగా పెట్టి రుణం తీసుకుంటారు. కాబట్టి రుణాన్ని కూడా పరిమితంగా తీసుకుని వివాహ ఖర్చులు పొదుపుగా చేయడానికి అవకాశం ఉంటుంది.

ఇంటి పునరుద్ధరణ, ఆస్తి కొనుగోలు

ఇల్లు పాడయినప్పుడు, ముఖ్యమైన వేడుకలకు ఇంటి పునరుద్ధరణ అనేది ఎలాంటి కుటుంబానికైనా అవసరమే. ఇంటిని మెరుగ్గా ఉంచుకోవడానికి చాలామంది తమ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఇలాంటి అవసరాలకు అందరికీ, అన్నివేళలా రుణాలు లభించవు. తమ పొదుపులు సరిపోనప్పుడు బంగారంపై రుణాన్ని తీసుకుని ఇంటి పునరుద్ధరణ చేసుకోవడం మంచిదే. కొన్నిసార్లు రియల్‌ ఎస్టేట్‌ ప్రాపర్టీలు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉంటుంది. నగదు వెంటనే అవసరం అయినప్పుడు కొంత మంది తమ ఇతర ప్రాపర్టీలను అమ్మేస్తూ  ఉంటారు. సమయం లేకపోవడం వల్ల తక్కువ ధరకే అమ్మాల్సి రావచ్చు. దీని బదులు బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల వద్ద రుణం తీసుకుని సరసమైన ధరకు ఆస్తులను కొనుగోలు చేయొచ్చు.

వ్యవసాయం

అనేక ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముక అయిన వ్యవసాయానికి పెట్టుబడుల అవసరం కూడా ఎక్కువే. ముఖ్యంగా వ్యవసాయం చేసేవారికి ప్రతి నెలా ఆదాయం ఉండదు కాబట్టి, వ్యక్తిగత రుణం దొరకడం కష్టమే. అందుచేత, వ్యవసాయ పెట్టుబడులకు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం మంచిదే. బంగారం తాకట్టు పెట్టినప్పుడు పొలానికి సంబంధించిన శిస్తు రశీదులు చూపిస్తే తక్కువ వడ్డీకి రుణం పొందే అవకాశం ఉంటుంది. రుణం తీర్చలేని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకులు రుణాన్ని రీషెడ్యూల్‌ కూడా చేస్తారు. రీషెడ్యూల్‌ చేయడం వల్ల, రుణాన్ని తీర్చడానికి తగిన సమయం కూడా ఉంటుంది.

వాహన కొనుగోలు

ప్రస్తుతం సొంత మోటారు బైక్‌ వాహనాన్ని సులభంగా నడపగలిగి ఉంటే అనేక ఇ-కామర్స్‌ సంస్థలు డెలివరీ బాయ్‌ ఉద్యోగాలను ఇస్తున్నాయి. ఇంకా చాలా సంస్థలు చిన్న గూడ్స్‌ వాహనాలు కలిగి ఉన్నవారికి వస్తువులు డెలివరీ చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. కానీ, మెరుగైన వాహనం పొందడానికి సొంత పూచికత్తుపై అందరికీ రుణం లభించక పోవచ్చు. కేవలం వాహనం విషయంలో రాజీపడి ఉపాధి పోగొట్టుకోవడం సరికాదు. కొద్దిగా బంగారం కలిగి ఉన్నా కూడా తాకట్టుతో బ్యాంకుల వద్ద రుణం తీసుకుని వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు, సొంతంగా ఉపాధిని పొందొచ్చు.

చివరిగా: అత్యవసర సమయాల్లో ఎవరికైనా బంగారంపై రుణం తక్షణ ఆర్థిక సాయం లాంటిది. వారికిష్టమైన/విలువైన బంగారం కూడా బ్యాంకుల వద్ద భద్రంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు