Go First Airlines: గోఫస్ట్‌ దివాలా!

దేశీయంగా మరో విమానయాన సంస్థ నష్టాల సుడిగాలుల్లో చిక్కుకుంది. ఇంజిన్ల సమస్యలతో సంస్థ ఆధీనంలోని 57 విమానాల్లో 28 కార్యకలాపాలు ఆపేయడంతో, ఈ చౌకధరల విమానాయాన సంస్థకు ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి.

Updated : 03 May 2023 09:45 IST

పీ&డబ్ల్యూ ఇంజిన్ల సమస్యలతో సగానికి పైగా విమానాలు నేలపైనే 
చుట్టుముట్టిన ఆర్థిక ఇబ్బందులు
స్వచ్ఛందంగా ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు 
నేడు, రేపు సర్వీసుల నిలిపివేత

ముంబయి/దిల్లీ: దేశీయంగా మరో విమానయాన సంస్థ నష్టాల సుడిగాలుల్లో చిక్కుకుంది. ఇంజిన్ల సమస్యలతో సంస్థ ఆధీనంలోని 57 విమానాల్లో 28 కార్యకలాపాలు ఆపేయడంతో, ఈ చౌకధరల విమానాయాన సంస్థకు ఆర్థిక సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ఈనెల 3, 4 తేదీల్లో సర్వీసులను నిలిపి వేయడంతో పాటు దివాలా పరిష్కార ప్రక్రియ కోసం జాతీయ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ), దిల్లీ బెంచ్‌కి స్వచ్ఛందంగా దరఖాస్తు చేస్తున్నట్లు సంస్థ మంగళవారం ప్రకటించింది. గోఫస్ట్‌కు అనుకూలంగా సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (ఎస్‌ఐఏసీ) ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు అమెరికా ఇంజిన్ల సంస్థ ప్రాట్‌ అండ్‌ విట్నీ నిరాకరించడంతోనే సంస్థ ఇంతటి తీవ్ర నిర్ణయానికి వచ్చింది. ఎన్‌సీఎల్‌టీ కనుక తమ దరఖాస్తును అంగీకరిస్తే, విమానాలు మళ్లీ నడుపుతామని సంస్థ తెలిపింది.

2005 నుంచి సేవలు

వాడియా గ్రూప్‌ 2005లో నెలకొల్పిన గోఫస్ట్‌, 2017 కల్లా దేశంలోనే అయిదో అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచింది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి నష్టాల్లో నడుస్తోంది. వరుసగా 3 ఆర్థిక సంవత్సరాల్లో ఏర్పడిన నష్టాలు కలిపితే దాదాపు రూ.4,000 కోట్లకు చేరాయి. ఇంకా 2022-23 నష్టాలు వెల్లడించాల్సి ఉంది. సంస్థను నిలబెట్టేందుకు గత మూడేళ్లలో వాడియా గ్రూప్‌ రూ.3,200 కోట్ల నిధుల్ని సమకూర్చగా, ఇందులో రూ.2,400 కోట్లను గత 24 నెలల్లోనే చొప్పించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ రూ.290 కోట్లు అందించింది. ప్రారంభం నుంచి చూస్తే, ఇప్పటివరకు వాడియా గ్రూప్‌ సుమారు రూ.6,500 కోట్ల పెట్టుబడుల్ని పెట్టింది. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) నుంచీ సంస్థ ఆర్థిక మద్దతు పొందింది. ఇవేవీ సంస్థను గట్టెక్కించలేకపోయాయి.

ఇంజిన్‌ సమస్యలు ఇలా

మిగతా దేశీయ విమానయాన సంస్థలు విస్తరణ దిశగా అడుగులు వేస్తుంటే, గోఫస్ట్‌ మాత్రం ఇంజిన్ల సమస్యలతో సతమతమవుతూ, విమాన సర్వీసులను నిలిపివేయాల్సిన పరిస్థితికి చేరింది.

గోఫస్ట్‌ విమానాల్లో 90 శాతం వరకు అమెరికాకు చెందిన ప్రాట్‌ అండ్‌ విట్నీ (పీడబ్ల్యూ) ఇంజిన్లను వినియోగిస్తున్నాయి. పీడబ్ల్యూ ఇంజిన్‌ కలిగిన తొలి ఏ320 విమానాన్ని 2016లో గోఫస్ట్‌ డెలివరీ తీసుకుంది. కేవలం 6-8 నెలల్లోనే ఇంజిన్లలో సమస్యలు తలెత్తడం మొదలయ్యాయి. ఇంజిన్ల సరఫరాలో ఆలస్యం కారణంగా, గోఫస్ట్‌ వద్ద ఉన్న 57 విమానాల్లో 50 శాతానికి పైగా నిలిచిపోయాయి. ఏవియేషన్‌ అనలిటిక్స్‌ సంస్థ సిరియమ్‌ ప్రకారం, 2022 ఏప్రిల్‌లో గోఫస్ట్‌  పోలిస్తే వారానికి 2,771 విమాన సర్వీసులను నడిపింది. గత నెలలో ఈ సంఖ్య 1,362 సర్వీసులకు పరిమితం అయ్యింది.

ఇదీ కారణం

గోఫస్ట్‌తో పీడబ్ల్యూ కాంట్రాక్టు ప్రకారం, ఇంజిన్‌లో లోపం తలెత్తితే 48 గంటల్లోపు మరో (స్పేర్‌) ఇంజిన్‌ను సరఫరా చేయాలి. పాడైన ఇంజిన్‌ను ఉచితంగా మరమ్మతు చేయాలి. విమానాల సేవలు నిలిపివేసిన కాలానికి, గోఫస్ట్‌కు పరిహారమూ అందించాలి. 2020 మార్చి వరకు పీడబ్ల్యూ సమయానికి స్పేర్‌ ఇంజిన్లను అందించింది. ఉచితంగా మరమ్మతుతో పాటు పరిహారమూ అందించింది. ఆ తర్వాత నుంచి పీడబ్ల్యూ నుంచి ఏదీ సమయానికి అందలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

రూ.10,800 కోట్ల ప్రభావం

పీడబ్ల్యూ నుంచి ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగానే ఆర్థిక కష్టాలు తీవ్రమైనట్లు గోఫస్ట్‌ సీఈఓ కౌశిక్‌ కోనా తెలిపారు. 50% సర్వీసులు నిలిచిపోవడంతో, ఆదాయం కోల్పోవడంతో పాటు నిర్వహణ వ్యయాల రీత్యా మొత్తం సంస్థపై రూ.10,800 కోట్ల ప్రభావం పడిందని వివరించారు.

సంస్థ ఆర్థిక అవసరాలను తీర్చే స్థితి లేనందునే జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు పేర్కొన్నారు. ఇది దురదృష్టకరమే అయినా, ఏమీ చేయలేని స్థితిలోనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి, డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కు తెలియజేసినట్లు కౌశిక్‌ వెల్లడించారు.

ఆర్బిట్రేషన్‌ అమలైతే సెప్టెంబరు కల్లా సేవల పునరుద్ధరణ

‘ఏప్రిల్‌ 27 కల్లా కనీసం 10 సర్వీసబుల్‌ లీజ్డ్‌ ఇంజిన్లు అందించాలని, తదుపరి నెలకు మరో 10 చొప్పున అదనపు ఇంజిన్లను 2023 డిసెంబరు వరకు అందించాలని ప్రాట్‌ అండ్‌ విట్నీకి సింగపూర్‌ ఆర్బిట్రేషన్‌ ఆదేశించింది. వీటిని కనుక ప్రాట్‌ అండ్‌ విట్నీ అమలు చేస్తే, ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబరు కల్లా పూర్తిస్థాయిలో సేవలు మళ్లీ ప్రారంభిస్తామని గోఫస్ట్‌ తెలిపింది.

5,000 మంది ఉద్యోగులు

* దేశీయ విమానయాన మార్కెట్‌లో గోఫస్ట్‌కు మార్చి త్రైమాసికం నాటికి 7.8 శాతం వాటా ఉంది.  జనవరి-మార్చిలో సుమారు 29.11 లక్షల మందిని దేశీయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేర్చింది. ప్రస్తుతం ఈ సంస్థలో సుమారు 5,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

* డీజీసీఏ షోకాజ్‌: ముందుగా సమాచారం ఇవ్వకుండా, ఈనెల 3, 4 తేదీల్లో విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించిన గోఫస్ట్‌కు, విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. షెడ్యూల్‌ సేవలు నిలిపి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించినందుకు ఈ నోటీస్‌ ఇచ్చింది. 24 గంటల్లోపు స్పందించాలని ఆదేశించింది. మే 5 నుంచి సర్వీసులపై కార్యచరణ ప్రణాళిక సమర్పించాలని అందులో పేర్కొంది.

గోఫస్ట్‌లో తలెత్తిన నగదు సంక్షోభం, స్వచ్ఛందంగా దివాలా పరిష్కార ప్రక్రియకు ఆ సంస్థ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించడం వంటి పరిణామాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సునిశితంగా పరిశీలిస్తోందని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ‘ఇంజిన్ల సమస్యలతో గోఫస్ట్‌కు ఈ పరిణామం ఎదురుకావడం దురదృకష్టకరం. న్యాయప్రక్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి’ అని విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని