మాపై ఆరోపణలన్నీ అవాస్తవాలే

18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్‌ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) సురేశ్‌ నారాయణ్‌ పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 02:10 IST

 నెస్లే ఇండియా సీఎండీ సురేశ్‌ నారాయణ్‌

గురుగ్రామ్‌: 18 నెలల కంటే తక్కువ వయసున్న చిన్నారుల ఆహార ఫార్ములేషన్‌ను అంతర్జాతీయ పద్ధతిలో నిర్ణయిస్తామని నెస్లే ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) సురేశ్‌ నారాయణ్‌ పేర్కొన్నారు. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా రూపొందిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం దురదృష్టకరమని.. అవన్నీ అవాస్తవాలని ఆయన అన్నారు. నిర్దిష్ట వయసుకు తగ్గ పోషణ అందేలా, శిశు ఆహారంలో ఎంత చక్కెర కలపాలన్నదీ నిర్ణయించామని.. అది భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల అధీకృత సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్దేశించిన గరిష్ఠ పరిమితి కంటే చాలా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ‘మా ఉత్పత్తి కారణంగా పిల్లలకు ఎటువంటి హానీ కలగదు. మేం వినియోగించే యాడెడ్‌ షుగర్‌లో మెజారిటీ భాగం సహజసిద్ధమైన చక్కెరే ఉంటుంది. ఎఫ్‌ఎస్‌ఏఏఐ 100 గ్రాముల ఆహారంలో అనుమతించిన 13.6 గ్రాముల కంటే, యాడెడ్‌ షుగర్‌తో పోలిస్తే నెస్లే వినియోగించిన 7.1 గ్రాముల చక్కెర చాలా తక్కువ’ అని నారాయణన్‌ పేర్కొన్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే, భారత్‌ సహా దక్షిణాసియా దేశాల్లో , ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో ఎక్కువ చక్కెర ఉందని.. ఐరోపా దేశాల్లో అసలు వాడడం లేదని స్విస్‌ స్వచ్ఛంద సంస్థ ఒకటి ఈ నెల మొదట్లో ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది చివర్లో నెస్‌ప్రెసో: దిల్లీలో తొలి ‘నెస్‌ప్రెసో’ బొటిక్‌ను ఈ సంవత్సరాంతంలో ప్రారంభిస్తామని నారాయణన్‌ తెలిపారు. ఆ తర్వాత మిగిలిన నగరాలకు విస్తరిస్తామన్నారు. ప్రీమియం ఉత్పత్తుల విభాగాన్ని ప్రస్తుతమున్న 12-13 శాతం వాటా (విక్రయాల్లో) నుంచి దీర్ఘకాలంలో 20 శాతానికి చేర్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. నెస్‌ప్రెసో అంతర్జాతీయంగా 90 దేశాల్లోని 800 బొటిక్‌లలో ఉందని ఆయన తెలిపారు. డాక్డర్‌ రెడ్డీస్‌తో ఏర్పాటు చేయబోయే సంయుక్త సంస్థ(జేవీ)లో తమకు 49% వాటా ఉంటుందని.. ఆరేళ్ల తర్వాత మా వాటాను 60 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని