సాంకేతిక అవాంతరాలకు జరిమానా

సాంకేతిక అవాంతరాలను గుర్తించడం, తొలగించడం, ప్రకటించడంలో ఏవైనా పొరబాట్లు జరిగితే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్‌ మౌలిక సంస్థలతో పాటు వాటి ఉన్నతాధికారులు అపరాధ రుసుములను

Published : 06 Jul 2021 01:11 IST

స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఇతర సంస్థలపై సెబీ
ఉన్నతాధికారులూ బాధ్యత వహించాలి

దిల్లీ: సాంకేతిక అవాంతరాలను గుర్తించడం, తొలగించడం, ప్రకటించడంలో ఏవైనా పొరబాట్లు జరిగితే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్‌ మౌలిక సంస్థలతో పాటు వాటి ఉన్నతాధికారులు అపరాధ రుసుములను ఎదుర్కోవాల్సి వస్తుందని సెబీ హెచ్చరిస్తోంది. ఆ మేరకు మార్కెట్‌ మౌలిక సంస్థల(ఎమ్‌ఐఐలు) కోసం ఒక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ(ఎస్‌ఓపీ)ను జారీ చేసింది. ఎన్‌ఎస్‌ఈలో సాంకేతిక అవాంతరాలతో 4 గంటల పాటు ట్రేడింగ్‌ నిలిచిన రోజు(ఫిబ్రవరి 24) నుంచి 5 నెలల్లోపే సెబీ ఈ అడుగు వేయడం విశేషం.

వీరికి: స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్‌, డిపాజిటరీలు.

ఎంత అపరాధ రుసుము: రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 కోట్ల వరకు.. ఎమ్‌ఐఐల మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసరు(సీటీఓ)లకు వారి వార్షిక వేతనంలో 10% వరకు విధించొచ్చు. సెబీ నిర్దేశించే వివిధ కాలావధుల ప్రకారం ఇవి మారతాయి.

సాంకేతిక అవాంతరానికి కారణాలను వెల్లడించే కాంప్రహెన్సివ్‌ రూట్‌కాజ్‌ అనాలసిస్‌(ఆర్‌సీఏ) నివేదికను సమర్పించడంలో ఆలస్యం చేసినా కూడా అపరాధ రుసుము విధిస్తారు. దీనిని 21 రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది.

సంఘటన జరిగిన 24 గంటల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలి.

ఒక్కో పనిదినం ఆలస్యానికి రూ.లక్ష చొప్పున రుసుము ఉంటుంది.

సాంకేతిక సమస్యలను సరైన సమయంలో పరిష్కరించకపోతే రోజుకు రూ.2-25 లక్షల వరకు పెనాల్టీ విధిస్తారు.

ఒకటి లేదా ఎక్కువ కీలక వ్యవస్థల్లో అవాంతరాలు తలెత్తితే అర గంటలోగా దానిని ‘డిజాస్టర్‌’గా ప్రకటించాలి. ఆ ప్రకటనను వెల్లడించడంలో ఆలస్యమైతే రెండు ఆర్థిక సంవత్సరాల స్టాండలోన్‌ నికర లాభంలో సగటున 10 శాతం లేదా రూ.2 కోట్లలో ఏది ఎక్కువైతే అది ప్రాతిపదికన కట్టాల్సి ఉంటుంది. ఉన్నతాధికారులూ తమ వార్షిక వేతనంలో 10 శాతం చొప్పున చెల్లించాలి.

సంఘటన జరిగిన 75 నిమిషాల నుంచి 3 గంటల్లోపు సాధారణ పరిస్థితులను నెలకొల్పలేకపోతే ఎమ్‌ఐఐలు రూ.50 లక్షలు చెల్లించాలి. 3 గంటల కంటే ఎక్కువ అవాంతరాలు నెలకొంటే రూ.కోటి కట్టాలి.

ఎమ్‌ఐఐలు తమ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికే ఈ చర్యలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని