ఉభర్తే సితారే పథకంలో తెలంగాణ నుంచి 3 ఎంఎస్‌ఎంఈలకు రుణాలు

వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమైన దేశీయ సంస్థలకు దాదాపు 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్ల) మేరకు రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Published : 27 Nov 2021 03:40 IST

ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంక్‌ డిప్యూటీ ఎండీ ఎన్‌.రమేశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమైన దేశీయ సంస్థలకు దాదాపు 10 కోట్ల డాలర్ల (సుమారు రూ.750 కోట్ల) మేరకు రుణాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎగ్జిమ్‌ బ్యాంక్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.రమేశ్‌ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 సంస్థలకు ఈ మొత్తం అందించనున్నట్లు హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన తెలిపారు. రాబోయే అయిదేళ్లలో ప్రాజెక్టు ఎగుమతుల కోసం దాదాపు 700 కోట్ల డాలర్ల (సుమారు రూ.52,500 కోట్ల) రుణాలు ఇచ్చే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. ఈ మొత్తాన్ని భారత ప్రభుత్వం, నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ ఇన్సూరెన్స్‌ అకౌంట్‌ (ఎన్‌ఈఐఏ) నుంచి స్వీకరిస్తామని తెలిపారు. దేశీయ ఎగుమతిదారులకు ఎన్నో మంచి అవకాశాలున్నాయని, అనేక రంగాల్లో పోటీని ఎదుర్కొనే సత్తా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇండియా ఎగ్జిమ్‌ బ్యాంకు ఇస్తున్న రుణాలకూ మంచి గుర్తింపు లభిస్తోందని తెలిపారు. ఎన్‌ఈఐఏ క్రెడిట్‌ ప్రోగ్రాంలో భాగంగా 15 దేశాల్లో దాదాపు 32 ప్రాజెక్టుల కోసం 313 కోట్ల డాలర్ల సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ ఏజెన్సీ ఇప్పటికే 225 కోట్ల డాలర్లను అంతర్జాతీయ బాండ్ల ద్వారా సేకరించిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.10లక్షల కోట్ల రుణాలు ఇచ్చామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1.20 లక్షల కోట్లకు చేరొచ్చని పేర్కొన్నారు.

100 సంస్థలకు పైగా..: ఎంఎస్‌ఎంఈలకు రుణ సదుపాయం కోసం ఉద్దేశించిన ఉభర్తే సితారే పథకం కింద 100కు పైగా సంస్థలకు సాయం చేయనున్నామని రమేశ్‌ తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు 3 సంస్థలను ఎంపిక చేశాం. వీటికి మొత్తం రూ.70-100 కోట్ల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. ఏడాది కాలంలో ఇక్కడి నుంచి 10 సంస్థలను, దేశ వ్యాప్తంగా 30కి పైగా సంస్థలను ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తాం’  అని వివిరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని