సూచీలకు ముడిచమురు మంటలు

అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు ముడిచమురు ధర గరిష్ఠస్థాయికి చేరడంతో మంగళవారం దేశీయ సూచీలు 1 శాతం వరకు కుదేలయ్యాయి. వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో అమెరికా బాండు రాబడులు పెరగడం, బ్యారల్‌ ముడిచమురు ధర 87 డాలర్ల

Updated : 19 Jan 2022 03:51 IST

అంతర్జాతీయ ప్రతికూలతలూ ప్రభావం చూపాయ్‌
సమీక్ష

అంతర్జాతీయ ప్రతికూలతలకు తోడు ముడిచమురు ధర గరిష్ఠస్థాయికి చేరడంతో మంగళవారం దేశీయ సూచీలు 1 శాతం వరకు కుదేలయ్యాయి. వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో అమెరికా బాండు రాబడులు పెరగడం, బ్యారల్‌ ముడిచమురు ధర 87 డాలర్ల ఎగువకు దూసుకెళ్లడంతో ప్రపంచ మార్కెట్లు ఎరుపెక్కాయి. యూఏఈ రాజధానిలోని చమురు కేంద్రంపై దాడి జరగడం కలవరపెట్టింది. ఈ ప్రభావం మన సూచీలపైనా పడింది. ముఖ్యంగా ఆఖరి గంటన్నర ట్రేడింగ్‌లో వాహన, లోహ, స్థిరాస్తి షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 33 పైసలు తగ్గి రెండు వారాల కనిష్ఠమైన 74.58 వద్ద ముగిసింది. ఆసియా, ఐరోపా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ రూ.3.78 లక్షల కోట్లు తగ్గి రూ.276.24 లక్షల కోట్లకు చేరింది.

సెన్సెక్స్‌ ఉదయం 61,430.77 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 61,475.15 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు తీవ్రంకావడంతో ఒకదశలో 60,662.57 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 554.05 పాయింట్ల నష్టంతో 60,754.86 వద్ద ముగిసింది.  నిఫ్టీ సైతం 195.05 పాయింట్లు కోల్పోయి 18,113.05 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,085.90- 18,350.95 పాయింట్ల మధ్య కదలాడింది.

త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో హెచ్‌ఎఫ్‌సీఎల్‌ షేరు 7.31 శాతం నష్టంతో రూ.89.35 వద్ద ముగిసింది.

డిసెంబరు త్రైమాసికంలో బుకింగ్‌లు రెండు రెట్లు పెరగడంతో ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ షేరు ఇంట్రాడేలో రూ.554.90 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.43 శాతం లాభంతో రూ.530.05 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 23 నష్టపోయాయి. మారుతీ 4.05%, అల్ట్రాటెక్‌ 3.83%, టెక్‌ మహీంద్రా 3.54%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 3.09%, టాటా స్టీల్‌ 2.86%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.22%, ఎల్‌ అండ్‌ టీ 2.14%, భారతీ ఎయిర్‌టెల్‌ 2.03%, విప్రో 1.98%, ఐటీసీ  1.67% మేర డీలాపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ 1.83% వరకు లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో టెలికాం, వాహన, స్థిరాస్తి, లోహ 2.76% వరకు తగ్గాయి. యంత్ర పరికరాలు, స్థిరాస్తి, పరిశ్రమలు, ఐటీ రాణించాయి. బీఎస్‌ఈలో 2285 షేర్లు నష్టాల్లో ముగియగా, 1145 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 83 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని