Published : 24 May 2022 02:54 IST

ప్రతి 30 గంటలకు ఓ బిలియనీర్‌

 ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది పేదరికంలోకి

 నిమిషానికో ఆకలి మరణం

 కొవిడ్‌ పరిణామాల వల్లే  

 దావోస్‌లో ఆక్స్‌ఫామ్‌ నివేదిక

దావోస్‌: కొవిడ్‌ పరిణామాల కాలంలో ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్‌ ఆవిర్భవించారని.. ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడుపేదరికంలోకి వెళ్లారని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌)లో విడుదలైన ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ నివేదిక అంచనా వేసింది. ఈ సంస్థ ‘ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌’ పేరిట విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ..

2 రోజులకు 100 కోట్ల డాలర్లు

నిత్యావసర వస్తువుల ధరలు దశాబ్దాల కంటే ఒక్క ఏడాదిలో వేగంగా పెరిగాయి. ఫలితంగా ఆహార, ఇంధన రంగాల్లోని కుబేరులు తమ సంపదను ప్రతి రెండు రోజులకు ఒక బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.7700 కోట్ల) చొప్పున పెంచుకున్నారు. అయితే లక్షల మంది ప్రజలు పేదరికం కోరల్లో చిక్కుకుపోయారు. బతకడానికే ఇబ్బంది పడ్డారు. కరోనాతో 2 కోట్ల మంది మరణించారు.

23 ఏళ్ల కంటే 24 నెలల్లోనే

కరోనా సమయంలో 573 మంది (ప్రతి 30 గంటలకు ఒకరు) కొత్త కుబేరులు ఆవిర్భవించారు. గత 23 ఏళ్లతో పోలిస్తే కరోనా సంభవించిన తొలి 24 నెలల్లో బిలియనీర్ల సంపద ఎక్కువగా పెరిగింది. 2000లో అంతర్జాతీయ జీడీపీలో ప్రపంచ బిలియనీర్ల సంపద వాటా 4.4 శాతం కాగా.. ఇపుడు 13.9 శాతానికి చేరింది. ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది చొప్పున, 26.3 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లారు. 

కష్టపడకుండానే సంపద

బిలియనీర్ల సంపద పెరిగేందుకు వారు మరింత శ్రమించడమో లేదా మరింత తెలివిగా ఆలోచించడమో కారణం కాదు. అధ్వాన ఆర్థిక పరిస్థితుల్లో కార్మికులు తక్కువ వేతనాకే అధికంగా శ్రమించడం ఇందుకు ఉపకరించింది. ప్రైవేటీకరణ, ఏకఛత్రాధిపత్యం కారణంగా కుబేరులు భారీ స్థాయిలో సంపదను పోగేసుకుని, పన్నులు లేని దేశాల్లో ఈ సంపదను దాచుకున్నారు. ప్రభుత్వ విధానాల్లోని సంక్లిష్టతల వల్లే ఇవి జరిగాయి. తూర్పు ఆఫ్రికాలో నిమిషానికొకరు ఆకలితో మరణించారు. ఈ అసమానతలు మానవత్వ బంధాలను తెంచేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం.

సెకనుకు రూ.2 లక్షల లాభం
ప్రపంచంలోని అతిపెద్ద ఇంధన కంపెనీలైన బీపీ, షెల్‌, టోటల్‌ ఎనర్జీస్‌, ఎక్సాన్‌, షెవ్రాన్‌లు కలిసి సెకనుకు 2600 డాలర్ల(దాదాపు రూ.2 లక్షల) లాభాన్ని పొందాయి. ఆహార రంగంలో కొత్తగా 62 మంది బిలియనీర్లు వచ్చారు. అమెరికాకు చెందిన కార్గిల్‌ కుటుంబ నేతృత్వలోని మూడే కంపెనీల చేతిలోనే ప్రపంచ వ్యవసాయ మార్కెట్‌లో 70% వాటా ఉంది. కరోనా సమయంలో మరో నలుగురు కుబేరులుగా మారడంతో, ఈ కుటుంబంలో కుబేరుల సంఖ్య 12కు చేరింది. శ్రీలంక నుంచి సూడాన్‌ దాకా ఆహార ధరలు భారీగా పెరగడంతో 60 శాతం అల్పాదాయ దేశాలు రుణ సంక్షోభం అంచుకు చేరాయి. కరోనా వల్ల ఔషధ రంగంలో 40 మంది కొత్త కుబేరులొచ్చారు. మోడర్నా, ఫైజర్‌ లాంటివి సెకనుకు 1000 డాలర్ల(దాదాపు రూ.77000) లాభాన్ని పొందాయి.

300 కోట్ల మంది ప్రజల కంటే ఆ 10 మంది సంపదే ఎక్కువ

మొత్తం 2,668 మంది కుబేరుల సంపద 3.78 లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగి 12.7 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.978 లక్షల కోట్ల)కు చేరింది. ప్రపంచంలోనే అట్టడుగున ఉన్న 310 కోట్ల మంది సంపదతో పోలిస్తే.. ప్రపంచ అగ్రగామి 10 మంది ధనవంతుల సంపదే ఎక్కువ. తొలి 20 మంది కుబేరుల సంపద మొత్తం సహారా ఆఫ్రికా జీడీపీ కంటే ఎక్కువ.

బిలియనీర్లపై ప్రత్యేక పన్ను వేయాలి

కరోనా సమయంలో అదాటు లాభాలు ఆర్జించిన కుబేరులపై ప్రభుత్వాలు ప్రత్యేక పన్ను విధించాలని ఆక్స్‌ఫామ్‌ సిఫారసు చేసింది. అర్జెంటీనా ఇప్పటికే ‘మిలియనీర్స్‌ టాక్స్‌’ను ప్రవేశపెట్టింది. అన్ని రంగాల్లోని భారీ కంపెనీలకు వచ్చిన అదాటు లాభాలపై 90% పన్ను(అదనపు లాభాలపై) తాత్కాలికంగా విధించాలని ఆక్స్‌ఫామ్‌ పిలుపునిచ్చింది. కేవలం 32 అగ్రగామి బహుళజాతి కంపెనీలపై అలా చేసినా.. 2020లో 104 బిలయన్‌ డాలర్ల (రూ.8 లక్షల కోట్లకు పైగా) ఆదాయం ప్రభుత్వాలకు వస్తుంది. కుబేరులపై, కర్బన ఉద్గారాలకు కారణమవుతున్న పారిశ్రామికవేత్తలపై శాశ్వత సంపద పన్ను విధించాలనీ సూచించింది. ‘మిలియనీర్లపై 2%; బిలియనీర్లపై 5% పన్ను విధించినా.. ఒక ఏడాదికి 2.52 లక్షల కోట్ల డాలర్లు వస్తుంది. ఇందువల్ల 230 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావొచ్చు. ప్రపంచానికి సరిపడా టీకాలు అందించొచ్చు. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య, సామాజిక భద్రతను అందించొచ్చ’ని పేర్కొంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని