సామాజిక అంకురాల్లో పెట్టుబడులు

సామాజికంగా ప్రభావితం చూపే అంకురాలకు పెట్టుబడులు అందించనున్నట్లు పేట్రికార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెల్లడించింది. ఎడ్యుటెక్‌, వ్యవసాయం, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం తదితర విభాగాల్లో పనిచేసే సంస్థలను ఇందుకోసం ఎంపిక చేసుకుంటున్నట్లు

Published : 29 May 2022 02:33 IST

పేట్రికార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: సామాజికంగా ప్రభావితం చూపే అంకురాలకు పెట్టుబడులు అందించనున్నట్లు పేట్రికార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వెల్లడించింది. ఎడ్యుటెక్‌, వ్యవసాయం, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, నీటి నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం తదితర విభాగాల్లో పనిచేసే సంస్థలను ఇందుకోసం ఎంపిక చేసుకుంటున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు శ్రవంత్‌ దేవభక్తిని తెలిపారు. ఇప్పటికే ఇలాంటి సంస్థలు ఆరింటిలో పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. ఈ ఏడాది చివరి నాటికి మరో రెండు సంస్థల్లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపారు. రాబోయే అయిదేళ్ల కాలంలో 25 అంకురాలకు పెట్టుబడులు సమకూర్చనున్నట్లు చెప్పారు. అంకురాలు భవిష్యత్తు ఊహించడం, మార్కెట్‌ పరిస్థితులకు తగ్గట్టుగా మలచుకోవడం, నైపుణ్యం ఉన్న మానవ వనరులు, సాంకేతికత తదితర అంశాల్లో దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అంశాల్లో వీటికి సహాయం చేయడంతోపాటు, సరైన ఆలోచనకు, సరైన సమయంలో పెట్టుబడులు సమకూర్చడం ద్వారా అవి మరింత వృద్ధి సాధించేందుకు పేట్రికార్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తోడ్పడుతుందని పేర్కొన్నారు.


అలుఫ్లూరైడ్‌ త్రైమాసిక ఆదాయం రూ.29 కోట్లు  

ఈనాడు, హైదరాబాద్‌: అలుఫ్లూరైడ్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.29.04 కోట్ల ఆదాయాన్ని, రూ.88.28 లక్షల నికరలాభాన్ని ఆర్జించింది. ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి ఆదాయం రూ.88.60 కోట్లు, నికరలాభం రూ.3.81 కోట్లు ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ నష్టాలు ప్రకటించింది. తాజాగా లాభాల్లోకి రావటం గమనార్హం. వాటాదార్లకు ఒక్కో షేర్‌కు (రూ.10 ముఖ విలువ) 10 శాతం చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని శనివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


రెండు ఆదాయ నమూనాలపై అదానీ డ్రోన్‌ విభాగం దృష్టి

దిల్లీ: అదానీ గ్రూప్‌నకు చెందిన వాణిజ్య డ్రోన్ల విభాగం రెండు ఆదాయ నమూనాలపై దృష్టి సారిస్తోంది. ‘వ్యవసాయ రంగంపై ప్రధాన దృష్టితో డీలర్‌ ఆధారిత; సేవల ఆధారిత ఆదాయ నమూనాలను తీసుకురావాలని భావిస్తున్నాం. మార్కెట్‌ స్పందనను బట్టి మా నిర్ణయాలను తీసుకుంటామ’ని అదానీ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంగరాజన్‌ విజయరాఘవన్‌ పేర్కొన్నారు. డీలర్‌ నమూనాలో సామగ్రిని నేరుగా వినియోగదారుకు విక్రయిస్తారు. సేవా నమూనాలో స్థానిక సంస్థ లేదా ఔత్సాహిక పారిశ్రామికవేత్తతో భాగస్వామ్యం కుదుర్చుకుని వివిధ సేవలకు ఫీజు తీసుకుని సామగ్రిని అందజేస్తారు. ట్రాక్టర్‌ పరిశ్రమ ఈ రెండు నమూనాల్లోనూ విక్రయాలు చేస్తోంది. డ్రోన్ల అంకురమైన జనరల్‌ ఏరోనాటిక్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజు అనంతరం తాజా అంశాలను రంగరాజన్‌ పేర్కొన్నారు. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు డ్రోన్‌ సాంకేతికతను వినియోగించాలన్న ప్రధాని మోదీ దార్శనికత నుంచి స్ఫూర్తి పొందామని ఆయన అన్నారు.


విద్యుత్‌ కార్ల ప్లాంట్ల కోసం ఓలా స్థలాన్వేషణ

దిల్లీ: బ్యాటరీలు, విద్యుత్‌ కార్ల తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం ఓలా ఎలక్ట్రిక్‌ అన్వేషిస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. సెల్‌ గిగాఫ్యాక్టరీ, విద్యుత్‌ కార్ల ప్లాంట్ల కోసం ఓలా ఎలక్ట్రిక్‌కు 1000 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ఈ ప్లాంటు రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్‌కు స్థలాలను ఇచ్చేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పోటీపడుతున్నాయని ఈ పరిణామంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. మరోవైపు నాలుగు చక్రాల కార్ల విభాగంలో అడుగుపెట్టాలన్న తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్‌ తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే కొన్ని కాన్సెప్ట్‌లను అభివృద్ధి చేసుకున్నట్లు సమాచారం. స్థలం కొనుగోలు కోసం ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలతో ఓలా సంప్రదింపులు చేస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెలలో స్థలాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.


జూన్‌ 2 నుంచి ఇండియావుడ్‌ ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌: కలప ఫర్నిచర్‌ తయారీ పరిశ్రమ ఆధ్వర్యంలో జూన్‌ 2నుంచి బెంగళూరులో ఇండియావుడ్‌ ప్రదర్శన జరగనుంది. అయిదు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో ఆసియాలోని ప్రముఖ ఫర్నిచర్‌ సంస్థలు పాల్గొననున్నాయి. కలప ఫర్నిచర్‌ ఇతర ఉత్పత్తుల విషయంలో వచ్చిన ఆధునిక సాంకేతికత, నైపుణ్యాలు, ఆటోమేషన్‌, డిజిటలైజేషన్‌ తదితరాల గురించి ఇందులో తెలుసుకోవచ్చని ఇండియావుడ్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సభ్యులు శివకుమార్‌ వేణుగోపాల్‌ తెలిపారు. 2025 నాటికి కలప ఉత్పత్తుల తయారీ పరిశ్రమ 2700 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు