Health Insurance: ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ఆరోగ్య బీమా ఎలా ఎంచుకోవాలి?

మీరు మీ కుటుంబ అవ‌స‌రాల‌కు అనుగుణంగా బీమా ప్లాన్‌ను తీసుకోవాలి.

Updated : 16 Nov 2021 14:37 IST

ఊహించ‌ని అనారొగ్యాల వల్ల సంభ‌వించే ఆర్ధిక క‌ష్టాల నుంచి కుటుంబాన్ని ర‌క్షించ‌డం చాలా ముఖ్యం. కుటుంబ ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని(ఫ్యామిలీ ఫ్లోటర్ పాల‌సీ) కొనుగోలు చేయ‌డం ద్వారా క్లిష్ట అనారోగ్య ప‌రిస్థితుల‌ను సాధ్య‌మైనంత‌గా ఎదుర్కొవ‌చ్చు. కోవిడ్ ప‌రిస్థితుల‌తో ఆరోగ్య బీమా అవ‌స‌రం ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఆరోగ్య బీమా ప్రాధాన్య‌త‌ అంద‌రికి తెలిసివ‌చ్చేలా చేసింది. ఇపుడు ఆరోగ్య బీమా ఎక్కువ కుటుంబాల‌కు క‌వ‌ర్ అయ్యేలా ప్ర‌భుత్వాలు కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. పేద‌వారికి.. ప్ర‌భుత్వ‌మే ఆరోగ్య శ్రీ లాంటి.. బీమా ప‌థ‌కాల‌ను అంద‌చేస్తోంది. కేంద్ర ప‌భుత్వం కూడా ఆరోగ్య సంజీవ‌ని లాంటి ప్రాధ‌మిక ఆరోగ్య బీమా పాల‌సీల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ భాగ‌స్వామ్యంతో అమ‌లు చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఉద్యోగాలు చేసేవారికి ఆయా కంపెనీలు బృంద‌ ఆరోగ్య బీమా పాల‌సీలను అంద‌చేస్తున్నాయి. మిగ‌తా వారు కూడా ఆరోగ్య బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేసుకుంటేనే మంచిది. అయితే ఈ కుటుంబ ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని కొనుగోలు చేసే ముందు ప‌రిగ‌ణించాల్సిన కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు ఉన్నాయి, అవి ప‌రిశీలిద్దాం.

కుటుంబంలో అందరికీ వ‌ర్తించేలా, అన్ని వ్యాధుల‌కు బీమా క‌వ‌ర్ చేసేలా ఉండే ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని కొనుగోలు చేయ‌డం ఒక స‌వాలుతో కూడుకున్న ప‌ని. మీరు మీ కుటుంబ అవ‌స‌రాల‌కు అనుగుణంగా బీమా తీసుకోవాలి.

స‌రిప‌డా ఆరోగ్య బీమా..
కుటుంబ స‌భ్యులంద‌రి వైద్య అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ప్లాన్‌లోని బీమా మొత్తం స‌రిపోతుందా, లేదా అని నిర్ధారించుకోవాలి. కుటుంబ స‌భ్యుల వ‌య‌స్సు, ముందుగా ఉన్న అనారోగ్యాలు మొద‌లైన వాటిని ప‌రిగ‌ణించాలి.  మీ త‌ల్లిదండ్రులను కూడా కుటుంబ ఆరోగ్య బీమాలో భాగంచేస్తే, వ‌య‌స్సు కార‌ణంగా అనారోగ్యం భారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌ ఉన్నందున‌,  పెరుగుతున్న వైద్య ఖ‌ర్చులకు స‌రిపోయే విధంగా క‌వ‌రేజ్ ఉండేలా చూసుకోవాలి. 

ప్రీమియం..
ఇది ఆరోగ్య బీమాను యాక్టివ్‌గా ఉంచ‌డం కోసం మీరు బీమా సంస్థ‌కు చెల్లించాల్సిన మొత్తం. ఆరోగ్య బీమా మొత్తం పెరిగిన‌ప్పుడు, ప్రీమియం మొత్తం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ ప్లాన్‌లో.. ప్రీమియం కుటుంబ స‌భ్యుల వ‌య‌స్సుపై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇలాంటి పాల‌సీల‌లో సాధార‌ణంగా కుటుంబంలో పెద్ద‌ వ‌య‌సు ఉన్న వ్య‌క్తి ఆధారంగా ప్రీమియంను నిర్ణ‌యిస్తారు.  ఇంకా మీరు యాడ్‌-ఆన్‌ల కోసం వెళితే కుటుంబ ఆరోగ్య బీమా ప్రీమియం ఎక్కువ‌వుతుంది.

బీమా సంస్థ నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు.. 
నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందే వీలుంటుంది. బీమాను కొనుగోలు చేసేట‌పుడు పాల‌సీలో చేర్చ‌బ‌డిన నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు ఎన్ని ఎక్కువ ఉంటే మీకు అంత విస్తృత‌మైన సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టే. ఎందుకంటే, మీకు అందుబాటులో ఉన్న ఆసుప‌త్రిలో న‌గ‌దు ర‌హిత చికిత్స సేవ‌ల‌ను పొంద‌డం సుల‌భ‌మౌతుంది. ఆసుప‌త్రికి చికిత్స బిల్లు చెల్లించ‌న‌క్క‌ర‌లేదు. బిల్లుల ప‌రిష్కారం కోసం ఆసుప‌త్రి వ‌ర్గాలు బీమా సంస్థ‌తో సంప్ర‌దింపులు చేస్తాయి.

ప్రీ అండ్ పోస్ట్ హాస్పట‌లైజేష‌న్ ఖ‌ర్చులు..
ఆసుప‌త్రిలో చేర‌డానికి ముందు, త‌ర్వాత చాలా సార్లు వైద్యుడిని సంప్ర‌దించాల్సి ఉంటుంది, ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఖ‌ర్చులు ఆరోగ్య బీమాలో క‌వ‌ర్ అయ్యే విధంగా ఉండాలి.  చాలా పాలసీలు ఆసుపత్రి లో చేరే 30 రోజుల ముందు వరకు, చేరాక 60 రోజుల వరకు ఖర్చులను కవర్ చేస్తాయి. ఈ విషయాన్ని పాలసీ డాక్యుమెంట్ లో వారు తెలుపుతారు.   

డే కేర్ విధానాలు..
చాలా వ‌ర‌కు బీమా సంస్థ‌లు.. పాల‌సీ చేసిన వ్య‌క్తి క‌నీసం 24 గంట‌లు, లేదా అంత‌కంటే ఎక్కువ స‌మయం ఆసుప‌త్రిలో ఉండాల్సి వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఖ‌ర్చులు క‌వ‌ర్ అయ్యేలా చేస్తాయి. కానీ డ‌యాల‌సీస్ వంటి అనేక వైద్య విధానాల‌కు కొన్ని గంట‌ల‌పాటు ఆసుప‌త్రిలో ఉంటే స‌రిపోతుంది. కాబ‌ట్టి మీ ఆరోగ్య బీమా ఇలా 24 గంటల కంటే తక్కువ అవసరమయ్యే డే కేర్ సౌక‌ర్యాల‌ను అందిస్తుందా లేదా అని చూసుకోవాలి.

అంబులెన్స్ ఛార్జీలు..
అంబులెన్స్ ఖ‌ర్చులను అనేక ఆరోగ్య బీమా సంస్థ‌లు కుటుంబ ఆరోగ్య బీమా ప‌థ‌కంలో చేర్చారు. వీటికి కొంత పరిమితి ఉండవచ్చు. అలాగే ఎయిర్ అంబులెన్స్ ర‌వాణా ఖ‌ర్చుల‌ను బీమా సంస్థ రీయింబ‌ర్స్ చేస్తుందా లేదా తెలుసుకోవాలి.

ప్ర‌త్యామ్నాయ చికిత్స ఖ‌ర్చులు..
ఆయుర్వేదం, హోమియోప‌తి మొద‌లైన ప్ర‌త్యామ్నాయ చికిత్స‌లు ఈ రోజుల్లో మంచి ఆద‌ర‌ణ పొందుతున్నాయి. అనేక బీమా సంస్థ‌లు ఈ చికిత్స‌ల కోసం ఇన్‌-పేషెంట్ కేర్‌కు సంబంధించిన ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తున్నాయి. ఈ స‌దుపాయం మీ ఆరోగ్య బీమాలో ఉందా లేదా అని చూసుకోండి.

వెయిటింగ్ పీరియ‌డ్..
ముందుగా ఉన్న అనారోగ్యాల‌కు ఇపుడు తీసుకున్న ఆరోగ్య బీమా క‌వ‌ర్ వెంట‌నే వర్తించకపోవచ్చు. సాధార‌ణంగా వెయిటింగ్ పీరియ‌డ్ 2 నుంచి 4 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉంటుంది. వెయిటింగ్ పీరియ‌డ్‌లో మీకు ముందుగానే ఉన్న అనారోగ్యాల‌కు చికిత్స క‌వ‌రేజ్ ఉండ‌దు. వెయిటింగ్ పీరియ‌డ్‌లో మీరు ఆ వ్యాధుల‌కు సంబంధించిన క్లెయిమ్ చేయ‌లేరు. ఈ విష‌యం చాలా కీల‌క‌మైంది,  ఎందుకంటే కుటుంబంలో పెద్ద‌ల‌కు కొన్ని అనారోగ్యాలు ఉంటాయి, వారికి చికిత్స త‌క్కువ స‌మ‌యంలోనే అందించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి త‌క్కువ వెయిటింగ్ పీరియ‌డ్ ఉన్న కుటుంబ ఆరోగ్య బీమా ప్లాన్‌ను తీసుకోండి. 

క్లెయిమ్ సెటిల్‌మెంట్..
బీమా సంస్థ క్లెయిమ్ సెటిల్మెంట్ వ్య‌వ‌హారాలు ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ శాతం ఉన్న బీమా సంస్థ‌తో వెళ్ల‌డం తెలివైన ప‌ని. లేదంటే మీ మెడిక‌ల్ బిల్లుల‌ను రీయింబ‌ర్స్ చేయ‌డానికి హైరానా ప‌డాల్సి ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి పరంగా హెచ్డీఎఫ్సీ ఎర్గో, స్టార్ హెల్త్, రిలయన్స్ హెల్త్, మాక్స్ బూపా లాంటి కంపెనీలను పరిశీలించవచ్చు.  

అలాగే మార్కెట్‌లో అంద‌రికీ ఒకే ర‌క‌మైన ఆరోగ్య బీమా ప్లాన్ అందుబాటులో లేద‌ని గ‌మ‌నించండి. అయితే మీకు వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు తక్కువ బీమా హామీ తో బేస్ ప్లాన్‌ని తీసుకోవ‌చ్చు. దానికి అదనంగా ఒక సూపర్ టాప్ అప్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ఉత్తమ రైడర్స్, యాడ్‌-ఆన్‌ల‌తో, మంచి క‌స్ట‌మ‌ర్ కేర్ స‌ర్వీస్‌ ఇచ్చే బీమా సంస్థ నుంచి కుటుంబ ఆరోగ్య బీమా ప్లాన్‌ను తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని