LIC IPO: ఎల్‌ఐసీ షేర్లు కొనాలా వద్దా? బ్రోకరేజీ సంస్థలు ఏమంటున్నాయి?

దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనున్న ఎల్‌ఐసీ ఐపీఓపై (LIC IPO) భారీ అంచనాలే నెలకొన్నాయి. సుమారు 6 కోట్ల మంది పాలసీదారులు దీనిపై ఆసక్తికొద్దీ తమ పాలసీలను పాన్‌తో లింక్‌ చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Updated : 30 Apr 2022 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనున్న ఎల్‌ఐసీ ఐపీఓపై (LIC IPO) భారీ అంచనాలే నెలకొన్నాయి. సుమారు 6 కోట్ల మంది పాలసీదారులు దీనిపై ఆసక్తికొద్దీ తమ పాలసీలను పాన్‌తో లింక్‌ చేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మొత్తం రూ.21వేల కోట్లను సమీకరించే ప్రణాళికతో వస్తున్న ఎల్‌ఐసీ ఐపీఓను కొనాలా వద్దా? అంటే మెజారిటీ వ్యక్తులు కొనాలనే సూచిస్తున్నారు. షేరు విలువ తక్కువగా ఉండడం, తిరుగులేని కంపెనీ చరిత్రను ఇందుకు కారణంగా చూపుతున్నారు. అయితే, పెట్టుబడి పెట్టేముందు ప్రైవేటు కంపెనీల నుంచి పోటీ, సంప్రదాయ పద్ధతుల్లోనే పాలసీల జారీ వంటివీ చూడాలని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు.

+ విలువ: 2021లో ఐపీఓల రూపంలో వివిధ కంపెనీలు రూ.లక్ష కోట్ల మేర సమీకరించాయి. ఓ విధంగా ఆయా కంపెనీలకు స్వర్ణయుగమనే చెప్పాలి. అయితే, 2022లో మాత్రం మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతోంది. ఓ విధంగా ఎల్‌ఐసీ ఐపీఓ పరిమాణం తగ్గడానికి ఇదో కారణం. అయితే, ఐపీఓ ద్వారా మార్కెట్‌ గతినే మార్చగలదని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐపీఓలో పాల్గొనాలని సూచిస్తుండడానికి ప్రధాన కారణం.. కంపెనీ ఎంబెడెడ్‌ వాల్యూను 1.11 రెట్లు మాత్రమే లెక్కించడం. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ ఇన్సూరెన్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఐపీఓకు రాగా.. వాటి ఎంబెడెడ్‌ వాల్యూను 3.4 రెట్లుగా లెక్కించారు. కాబట్టి ఈ విషయంలో ఎల్‌ఐసీ షేర్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చని, ఇదో సదావకాశం అని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

+ కంపెనీ చరిత్ర: జీవిత బీమా అనే దానికి ఎల్‌ఐసీ పర్యాయపదంగా మారిపోయింది. గత 65 ఏళ్లుగా బీమా వ్యాపారంలో రారాజుగా వెలుగొందుతోంది. మొత్తంగా బీమా రంగంలో 61.6 శాతం వాటా ఎల్‌ఐసీదే. వ్యక్తిగత పాలసీ విభాగంలో 71.8 శాతం, గ్రూప్‌ పాలసీల విభాగంలో 88.8 శాతం వాటా కలిగి ఉంది. కంపెనీపై ఎలాంటి మచ్చా లేకపోవడం మరో ప్రధాన అంశం. భవిష్యత్‌లోనూ ఈ హవా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి.. ఐపీఓలో పాల్గొనొచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఇవీ చూడండి..

ఆనంద్‌ రాథి, రెలిగేర్‌ బ్రోకింగ్‌, మార్వాడీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ వంటి బ్రోకరేజీ సంస్థలు ఎల్‌ఐసీ ఐపీఓకు సబ్‌స్క్రైబ్‌ రేటింగే ఇచ్చాయి. అయితే, కొందరు ఇన్వెస్టర్లు మాత్రం పెట్టుబడి పెట్టే ముందు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రైవేటు కంపెనీల నుంచి వస్తున్న పోటీ వల్ల ఎల్‌ఐసీ తన మార్కెట్‌ వాటాను క్రమంగా కోల్పోతోందని, వార్షిక వృద్ధి రేటు సైతం ప్రైవేటు కంపెనీల కంటే తక్కువ ఉందని సూచిస్తున్నారు. దీనికి తోడు ఎల్ఐసీ పాలసీలు ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిలో 90 శాతం పాలసీలు ఏజెంట్ల ద్వారానే జారీ అవుతున్నాయి. రెన్యువల్‌ ప్రీమియంలు మాత్రమే 36 శాతం డిజిటల్‌గా అవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు మాత్రం ఈ విషయంలో ముందున్నాయి. ఇదే కొనసాగితే భవిష్యత్‌లో పాలసీ సొమ్మును సేకరించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాబట్టి ఐపీఓలో పాల్గొనేముందు వీటిని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

(గమనిక: స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న అంశం. ఇందులో మదుపు చేయడం పూర్తిగా మీ వ్యక్తిగత వ్యవహారం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

ఎల్‌ఐసీ ఐపీఓ గురించి మరిన్ని విషయాలు..

  • ఐపీఓ ప్రారంభం: మే 4
  • ఐపీఓ ముగింపు: మే 9
  • ధరల శ్రేణి : రూ.902-రూ.949
  • తగ్గింపు: రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు: రూ.45, పాలసీదారులకు రూ.60
  • దరఖాస్తు: కనీసం 15 షేర్లకు. ఒక లాట్‌ (15 షేర్లు) నుంచి గరిష్ఠంగా 14 లాట్‌ల (210 షేర్లు) కోసం దరఖాస్తు చేయొచ్చు.
  • డీమ్యాట్‌ ఖాతా: ఎల్‌ఐసీ ఐపీఓకి దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా డీమ్యాట్‌ ఖాతా ఉండాలి. మీకు ఇప్పటికే డీమ్యాట్‌ ఖాతా ఉంటే దానిని ఉపయోగించుకోవచ్చు. కొత్తగా మరోటి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 

Also Read: ఎల్‌ఐసీ ఐపీఓకి ఇలా దరఖాస్తు చేసుకోండి!

పాన్‌ జత చేశారా: ఎల్‌ఐసీ పాలసీదారులకు రూ.60 తగ్గింపుతో షేర్లు కేటాయించనుంది. దీన్ని పొందాలంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి 13 నాటికి ఏదో ఒక ఎల్‌ఐసీ పాలసీ ఉండాలి. బృంద పాలసీలో సభ్యులుగా ఉన్నవారు ఈ కోటా కిందకు రారు. అదే విధంగా పాలసీకి పాన్‌ను ఫిబ్రవరి 28లోగా అనుసంధానం చేసి ఉండాలి. పాలసీ ఉన్నప్పటికీ.. గడువు తేదీ లోపు పాన్‌ను అనుసంధానం చేయని వారు.. రిటైల్‌ కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అప్పుడు రూ.45 తగ్గింపు వర్తిస్తుంది.

Also Read: ఎల్ఐసీ పాల‌సీతో పాన్ లింక్ అయ్యిందా? స్టేట‌స్ చెక్‌ చేయండిలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని