Twitter: ట్విటర్‌ టేకోవర్‌పై మస్క్‌ తొలి సందేశం ఏంటంటే..?

ఒప్పందం ఖరారైన వెంటనే మస్క్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనని తీవ్రంగా విమర్శించే వారు సైతం ట్విటర్‌లో కొనసాగుతారని మరో ట్వీట్‌లో మస్క్‌ తెలిపారు

Updated : 26 Apr 2022 11:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎట్టకేలకు ట్విటర్‌.. ఎలాన్ మస్క్‌ వశమైంది. రెండు వారాల క్రితమే ఈ సంస్థలో 9.2% వాటా కొనుగోలు చేసినట్లు ప్రకటించిన మస్క్‌ తాజా సంస్థను పూర్తిగా తన అధీనంలోకి తీసుకోనున్నారు. దాదాపు 44 బిలియన్‌ డాలర్లకు ఒప్పందం కుదిరింది. ఈ కొనుగోలుకు అవసరమైన నిధులను ఆయన బ్యాంకుల ద్వారా సమకూర్చుకోనున్నారు. ట్విటర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతానని డీల్‌ ఖరారైన తర్వాత ఆయన తన తొలి సందేశంలో తెలిపారు.

‘‘ప్రజాస్వామ్య పరిరక్షణకు వాక్‌ స్వాతంత్ర్యం గట్టిపునాది. భవిష్యత్తులో మానవాళికి కావాల్సిన కీలక అంశాలపై చర్చించేందుకు ట్విటర్‌ ఒక డిజిటల్‌ వేదిక. కొత్త ఫీచర్ల ద్వారా ట్విటర్‌ను మునునుపెన్నడూ లేనంత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. అల్గారిథమ్‌ను ఒపెన్‌సోర్స్‌లో ఉంచి విశ్వసనీయతను పెంచుతాం. ట్విటర్‌కు ఉన్న పూర్తిస్థాయి సామర్థ్యాన్ని వెలికితీసేందుకు కంపెనీ, యూజర్లతో కలిసి పనిచేసేందుకు వేచిచూస్తున్నా’’ అని ఒప్పందం ఖరారైన వెంటనే మస్క్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనని తీవ్రంగా విమర్శించే వారు సైతం ట్విటర్‌లో కొనసాగుతారని మరో ట్వీట్‌లో మస్క్‌ వెల్లడించారు. వాక్‌ స్వాతంత్ర్యం అంటేనే అదని వ్యాఖ్యానించారు.

డీల్‌ దిశగా సాగిన ప్రయాణం..

జనవరి 31: ట్విటర్‌లో వాటాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు. మార్చి 14 నాటికి 5 శాతం వాటాలను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేయలేదు. తద్వారా తక్కువ ధరలోనే మరిన్ని స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.

మార్చి 24: వాటాల కొనుగోలు విషయాన్ని గోప్యంగా ఉంచుతూనే ట్విటర్‌పై మస్క్‌ విమర్శల దాడి ప్రారంభించారు. వాక్‌ స్వాతంత్య్రానికి ట్విటర్‌ కట్టుబడి ఉందా? అని పోల్‌ నిర్వహించారు. కొత్త వేదిక కావాలా?అని యూజర్లను ప్రశ్నించారు.

ఏప్రిల్‌ 4: మస్క్‌ తన వాటాలను బహిర్గతం చేశారు. ఎడిట్‌ బటన్‌ ఉండాలని భావిస్తున్నారా?అని యూజర్లను ప్రశ్నించారు.

ఏప్రిల్‌ 9: బోర్డులో చేరాలన్న ట్విటర్‌ ప్రతిపాదనను మస్క్‌ తిరస్కరించారు.

ఏప్రిల్‌ 14: అమెరికా సెక్యూరిటీ ఎక్స్ఛేంజీ కమిషన్‌లకు ఇచ్చిన సమాచారంలో ట్విటర్‌ ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద 43 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేస్తానని ఆఫర్‌ ప్రకటించారు.

ఏప్రిల్‌ 15: మస్క్‌ కొనుగోలును అడ్డుకునేందుకు ట్విటర్‌ ‘పాయిజన్‌ పిల్‌’ వ్యూహాన్ని అమలు చేసింది.

ఏప్రిల్‌ 21: ట్విటర్‌ కొనుగోలు నిమిత్తం 46.5 బిలియన్‌ డాలర్ల నిధుల్ని వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సమీకరించుకోనున్నట్లు మస్క్‌ వెల్లడించారు.

ఏప్రిల్‌ 24: మస్క్‌తో ట్విటర్‌ బోర్డు చర్చలు ప్రారంభించింది.

ఏప్రిల్‌ 25: మస్క్‌ ప్రతిపాదించిన ధరకు ట్విటర్‌ను విక్రయించేందుకు కంపెనీ బోర్డు అంగీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని