YouTube: యూట్యూబ్‌ సీఈవోగా భారతీయుడు నీల్‌ మోహన్‌ నియామకం

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ సీఈవోగా ఇండియన్‌-అమెరికన్‌ నీల్‌ మోహన్‌  నియమితులయ్యారు. సూసన్‌ వొజిసికి తన పదవి నుంచి వైదొలగడంతో యూట్యూబ్‌ యాజమాన్యం ఈ చర్యలు చేపట్టింది.    

Published : 17 Feb 2023 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌, సోషల్‌ మీడియా దిగ్గజం యూట్యూబ్‌(YouTube)కు భారతీయుడు నీల్‌ మోహన్‌(Neal Mohan) సీఈవోగా నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా సీఈవోగా ఉన్న సూసన్‌ వొజిసికి పదవి నుంచి వైదొలగడంతో యూట్యూబ్‌ యాజమాన్యం ఇండియన్‌-అమెరికన్‌ అయిన నీల్‌ మోహన్‌ను కొత్త సీఈవోగా నియమించింది. ప్రస్తుతం నీల్‌ మోహన్‌ యూట్యూబ్‌లో చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇక ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌ గూగుల్‌ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌(Sundar Pichai), మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా సత్య నాదేళ్ల(Satya Nadella), అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌(Shantanu Narayen) ఉన్నారు. ఇక నీల్‌ మోహన్‌ మరోసారి భారత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. మరో భారతీయుడు పరాగ్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌కు సీఈవోగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక కొత్తగా సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న నీల్‌మోహన్‌కు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అభినందనలు తెలిపారు. సుసాన్‌ వొజిసికి సేవలను కొనియాడారు. సూసన్‌ అసాధారణ టీమ్‌ను సిద్ధం చేశారని పేర్కొన్నారు. యూట్యూబ్‌ను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించాలని తన ప్రకటనలో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. నీల్‌ మోహన్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌. 2008లో గూగుల్‌లో చేరారు.

కుటుంబ, ఆరోగ్యం, ఇతర ప్రాజెక్ట్‌లపై దృష్టి కోసమే..

సీఈవో పదవి నుంచి వైదొలిగిన సూసన్‌ వొజిసికికి కంపెనీతో ఎంతో అనుబంధం ఉంది. ఇక యూట్యూబ్‌ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌లో గత 25ఏళ్లుగా పలు పదవుల్లో కొనసాగారు. యూట్యూబ్‌కు గత తొమ్మిది ఏళ్లుగా సీఈవోగా ఉన్నారు. తన పదవి నుంచి వైదొలుగుతున్న క్రమంలో సూసన్‌ కంపెనీ ఉద్యోగులకు లేఖ రాశారు. కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్ట్‌లపై దృష్టి నిలిపేందుకు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. కొత్త జీవితం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆల్ఫాబెట్‌ వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గే బ్రిన్‌ ఆమె సేవలను కొనియాడారు. గూగుల్‌ చరిత్రలో సూసన్‌కు ఒక ప్రత్యేక స్థానమున్నట్లు పేర్కొన్నారు. ప్రతిచోటా ప్రజలు ఉపయోగించే ఉత్పత్తులకు ఆమె అత్యంత అద్భుత సహకారం అందించినట్లు తెలిపారు. సూసన్‌ సీఈవోగా ఉన్న సమయంలో యూట్యూబ్‌ ఎంతో స్థాయికి చేరుకుంది. ఎన్నో లాభాలను కంపెనీకి అందించారు. గతేడాది యూట్యూబ్‌ ప్రకటనల ఆధారంగా 29.2 బిలియన్‌ డాలర్లను సంపాదించింది. ఇది మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ఆదాయంలో 10 శాతం కంటే ఎక్కువే. ఇక కొత్త సీఈవో నీల్‌ మోహన్‌తో సూసన్‌కు ఎంతో స్నేహపూర్వక అనుబంధం ఉంది. తొలుత వీరిద్దరు గూగుల్‌ ప్రకటనల విభాగంలో కలిసి పనిచేశారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని