PAN-Aadhaar: మదుపర్లకు పాన్‌-ఆధార్‌ లింక్‌పై సెబీ కీలక సూచన!

మార్చి 31, 2023 కల్లా పాన్‌కార్డు (Pancard) పొందినవారు దాన్ని ఆధార్‌ (Aadhaar)తో అనుసంధానం చేయకపోతే వారి పాన్‌కార్దు పనిచేయదని, ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం వారిపై చర్యలు ఉంటాయని సెబీ (SEBI) తెలిపింది.

Updated : 08 Mar 2023 22:33 IST

దిల్లీ: మదుపరులంతా (Investors) తమ ఆధార్‌-పాన్‌ (Aadhaar-Pancard)ను మార్చి చివరికల్లా అనుసంధానం చేయాలని స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కోరింది. దీనివల్ల స్టాక్‌ మార్కెట్‌ (Stock Market)లో లావాదేవీలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చని తెలిపింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. గతేడాది మార్చిలో  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మార్చి 31, 2023 కల్లా పాన్‌కార్డు పొందినవారు దాన్ని ఆధార్‌తో అనుసంధానం చేయకపోతే వారి పాన్‌కార్దు పనిచేయదని, ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం వారిపై చర్యలు ఉంటాయని సెబీ తెలిపింది. 

‘‘స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల్లో ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు మార్చి 31, 2023 కల్లా మదుపరులంతా తమ పాన్‌కార్డ్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఒకవేళ ఎవరైనా పాన్‌-ఆధార్‌ లింక్‌ చేయకపోతే వారి పాన్‌కార్డు పనిచేయదు. అలానే వారిని నాన్‌-కేవైసీ పూర్తి చేయని వారిగా పరిగణించడంతోపాటు, వారి లావాదేవీలపై పరిమితులు విధిస్తాం’’ అని సెబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించేందుకు చివ‌రి తేదీ మార్చి 31,2023. ఈ గ‌డువు లోపు లింక్ చేసేందుకు రూ.1000 ఆల‌స్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు  2021 ఆర్థిక బిల్లులో ప్రభుత్వం కొత్త సెక్షన్ 234 హెచ్‌ను ప్రవేశపెట్టింది. ఇంత‌వ‌ర‌కు పాన్‌- ఆధార్‌‌ లింక్ చేయ‌ని వారు ఈ నెలాఖ‌రు లోపు లింక్ చేయ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని