హాథ్రస్‌ ఘటనలో మరో ట్విస్ట్‌!

దేశంలో సంచలనం సృష్టించిన హాథ్రస్‌లో యువతి హత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు తమను తాము అమాయకులుగా పేర్కొంటూ బాధితురాలి కుటుంబ .........

Updated : 08 Oct 2020 21:26 IST

బాధితురాలి కుటుంబంపై నిందితుల తీవ్ర ఆరోపణలు

నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న బాధితురాలి తండ్రి

హాథ్రస్‌: దేశంలో సంచలనం సృష్టించిన హాథ్రస్‌లో యువతి హత్యాచారం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులు తమను తాము అమాయకులుగా పేర్కొంటూ బాధితురాలి కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు హాథ్రస్‌ ఎస్పీ వినీత్‌ జైశ్వాల్‌కు వారు లేఖ రాసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. యువతిపై హత్యాచారం ఘటనలో పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. యువతితో తమకు స్నేహం ఉండేదని, బాధితురాలితో తరచూ తాము మాట్లాడుతుండేవాళ్లమని నిందితులు లేఖలో పేర్కొన్నారు. తమ స్నేహం కుటుంబ సభ్యులకు నచ్చేది కాదని పేర్కొన్నారు. బాలికను కొట్టిన చోట తాము లేమని లేఖలో తెలిపారు. ఆ ఘటన జరిగిన రోజు తాను అక్కడే ఉన్నానని, బాధితురాలి తల్లి, సోదరుడు అక్కడికి వచ్చి అభ్యంతరం తెలపడంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు ప్రధాన నిందితుడు తెలిపాడు. తనతో స్నేహం వల్లే యువతిని తీవ్రంగా కొట్టారని లేఖలో ఆరోపించాడు. బాధితురాలి కుటుంబం తమపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని ఆరోపించారు. ఈ విషయంలో  తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతూ రాసిన లేఖలో చివరన నలుగురు నిందితులు తమ వేలిముద్రలు వేశారు. 

ధ్రువీకరించిన జైలు అధికారి

మరోవైపు, బాధితురాలి సోదరుడు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సందీప్‌ ఠాకూర్‌తో ఫోన్‌లో మాట్లాడాడని, గతేడాది అక్టోబర్‌ నుంచి మార్చి వరకు దాదాపు 104 ఫోన్‌ కాల్స్‌ చేసినట్టు పోలీసులు పేర్కొనడం గమనార్హం. అయితే, నిందితులు హథ్రాస్‌ ఎస్పీకి లేఖ రాసినట్టు అలీగఢ్‌ జైలు సీనియర్‌ సూపరింటెండెంట్‌ అలోక్‌ సింగ్‌ ధ్రువీకరించారు. బుధవారం సాయంత్రమే లేఖరాశారని, చట్టప్రకారం తాము ఆ లేఖను ఎస్పీకి పంపినట్టు తెలిపారు. 

మాపై నిందలు వేసేందుకే..: బాధితురాలి తండ్రి

అయితే, నిందితుల ఆరోపణలపై బాధితురాలి తండ్రి స్పందించారు. తన కుమార్తెను కోల్పోయామని, ఇప్పుడు నిందితులు తమపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్ల ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. తమకు ఎలాంటి పరిహారం అక్కర్లేదని.. న్యాయం కావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని