Shraddha murder: క్షణికావేశంలోనే శ్రద్ధాను చంపేశా.. కోర్టులో అంగీకరించిన అఫ్తాబ్‌

కోపం, ఆవేశంలో శ్రద్ధాను తాను హత్య చేశానని ఆమె ప్రియుడు అఫ్తాబ్‌ కోర్టులో అంగీకరించాడు. ఈ కేసులో అఫ్తాబ్‌ కస్టడీ ముగియడంతో నేడు న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.

Updated : 22 Nov 2022 13:27 IST

దిల్లీ: సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాను దిల్లీ పోలీసులు నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. క్షణికావేశంలోనే తాను శ్రద్ధాను హత్య చేసినట్లు నిందితుడు న్యాయస్థానం ముందు అంగీకరించాడు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు అయినందున తనకు ఘటనకు సంబంధించి చాలా విషయాలు గుర్తుకు రావడం లేదని అఫ్తాబ్‌ చెప్పడం గమనార్హం.

ఈ కేసులో అఫ్తాబ్‌కు విధించిన ఐదు రోజుల కస్టడీ ముగియడంతో మంగళవారం అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాకేత్‌ కోర్టు ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా న్యాయస్థానం అతడిని విచారించగా.. శ్రద్ధాను హత్య చేసింది తానే అని అంగీకరించాడు. ‘‘ఆ రోజు ఏం జరిగిందో.. అదంతా ఘర్షణ వాతావరణంతో క్షణికావేశంలో జరిగింది. అయితే కేసు దర్యాప్తు కోసం నేను పోలీసులకు సహకరిస్తా. శ్రద్ధా శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పాను. దీని గురించి అన్ని విషయాలు కోర్టుకు వెల్లడిస్తా. నేను చెప్పేవన్నీ నిజాలే. పోలీసులను తప్పుదోవ పట్టించడం లేదు. అయితే ఘటన జరిగి నెలలు గడిచినందున చాలా విషయాలు నాకు గుర్తు రావట్లేదు’’ అని అఫ్తాబ్‌ కోర్టుకు తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అతడి పోలీసు కస్టడీని న్యాయస్థానం మరో నాలుగు రోజులు పొడిగించింది.

సీబీఐకి అప్పగించేందుకు నిరాకరణ..

ఇదిలా ఉండగా.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ‘‘దిల్లీ పోలీసులను అనుమానించాల్సిన అవసరం ఏముంది? ఈ పిటిషన్‌ను విచారించేందుకు మాకు ఒక్క కారణం కూడా కన్పించట్లేదు’’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

గురుగ్రామ్‌ అడవిలో రంపం పడేసి..

శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. హత్య అనంతరం ఆమె శరీరభాగాలను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన రంపం, బ్లేడ్‌ను గురుగ్రామ్‌లోని అటవీప్రాంతంలో పడేసినట్లు అఫ్తాబ్‌ విచారణలో చెప్పాడట. ఇక మరో కత్తిని మెహ్‌రౌలీలోని చెత్తకుప్పలో విసిరేసినట్లు చెప్పాడని దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆ ఆయుధాల కోసం గురుగ్రామ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు రెండుసార్లు వెతికినా అవి దొరకలేదు. దీంతో నిందితుడు చెబుతున్న విషయాలు నిజమా? కాదా? అన్నది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు.

ఆఫ్తాబ్‌ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు కోర్టు నుంచి కూడా అనుమతి లభించడంతో నేడు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. దీని తర్వాత నార్కో ఎనాలసిస్‌ పరీక్ష కూడా జరపనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని