Child Selling Racket: పేద తల్లులే లక్ష్యం.. శిశు విక్రయ ముఠా గుట్టు రట్టు

పిల్లల్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును బెంగళూరు పోలీసులు రట్టు చేశారు. తమిళనాడులోని వైద్యుల సాయంతో ఈ ముఠా నడుస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 28 Nov 2023 19:42 IST

బెంగళూరు: మాతృత్వపు అనుభూతి వర్ణించలేనిది. ‘అమ్మ’ అనే పిలుపు కోసం ఎంతో మంది స్త్రీలు ఆరాటపడుతుంటారు. కానీ, కొందరు తల్లులు మాత్రం అమ్మతనానికి మచ్చ తెచ్చేలా తమ పిల్లల్ని విక్రయిస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో అమ్ముకున్న వారు కొందరైతే.. కన్నబిడ్డలను పోషించే స్థోమత లేక అమ్మకానికి పెట్టిన దయనీయ పరిస్థితి కొందరిది. అలాంటి వారినే లక్ష్యంగా చేసుకొని చిన్నారుల విక్రయాలు కొనసాగిస్తున్న ముఠా గుట్టును (Child Selling Racket) బెంగళూరు పోలీసులు (Bengaluru Police) రట్టు చేశారు. అప్పుడే పుట్టిన పసికందు నుంచి.. నెలల పిల్లల వరకు వీళ్లు కొనుగోలు చేస్తున్నట్లు తేల్చారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు 10 మంది చిన్నారుల్ని ఈ ముఠా వివిధ చోట్ల విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వివరాలను ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌ దయానంద్‌ మీడియాకు వెల్లడించారు. 

ఈ ముఠాతో తమిళనాడులోని 4 ప్రముఖ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులకు కూడా సంబంధముందని దయానంద్‌ తెలిపారు. ఒక్కో చిన్నారిని రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం రాత్రి 20 రోజుల మగ శిశువును విక్రయ ముఠా నుంచి పోలీసులు రక్షించడంతో మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు సిటీ సెంట్రల్‌ క్రైం బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ముగ్గురు మహిళలు ఓ చిన్నారితో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. 

దీంతో వాళ్లని కస్టడీలోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఇతరులకు అనుమానం రాకుండా నిందితులు చిన్నారులను కార్లలోనే రవాణా చేస్తున్నారని దయానంద్‌ తెలిపారు. తమిళనాడులోని 4 ఆస్పత్రులు, డాక్టర్లు, బెంగళూరులోని ఓ మహిళ కలిసి ఈ ముఠాను నడుపుతున్నట్లు చెప్పారు. ఈ కేసులో ముగ్గురు మహిళలతో సహా నలుగురు నిందితులను ఆర్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కన్నన్‌ రామస్వామి, మురుగేశ్వరి, హేమలత, శరణ్యగా గుర్తించారు. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దీని వెనక ఎవరెవరు ఉన్నారన్న దానిపైనా ఆరా తీస్తున్నామని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని