ప్రభుత్వ హాస్టల్‌లో యువతిపై హత్యాచారం.. ఆపై అనుమానిత గార్డు ఆత్మహత్య..!

College Student Murder: ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటున్న ఓ కాలేజీ విద్యార్థిని హత్యాచారానికి గురైంది. ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడు కొన్ని గంటల వ్యవధిలోనే రైలు పట్టాలపై శవమై కనిపించాడు. అతడు  ఆత్మహత్య చేసుకొన్నట్లు అనుమానిస్తున్నారు.

Published : 07 Jun 2023 12:00 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లోని దక్షిణ ముంబయి (Mumbai)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రభుత్వ వసతి గృహంలో 18 ఏళ్ల విద్యార్థిని హత్యాచారానికి (Rape and Murder) గురైంది. కాగా.. ఈ ఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న హాస్టల్‌ సెక్యూరిటీ గార్డు.. రైలు పట్టాలపై శవమై కన్పించడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం..

అకోలా ప్రాంతానికి చెందిన ఓ 18 ఏళ్ల యువతి ముంబయి శివారులోని బాంద్రాలోని ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వేసవి సెలవులు పూర్తవడంతో ఇటీవలే ఇంటి నుంచి ప్రభుత్వ వసతి గృహానికి తిరిగొచ్చింది. అయితే, మంగళవారం ఉదయం ఆమె కన్పించకుండా పోయింది. ఆమె ఉంటున్న హాస్టల్‌ గది బయటి నుంచి తాళం వేసి ఉంది. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో హాస్టల్‌ అధికారులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆమె బయటికెళ్లినట్లు అందులో లేదు. మెయిన్‌గేట్ వద్ద ఉన్న బుక్‌లోని ఆమె సంతకం కూడా లేదు. దీంతో అనుమానం వచ్చిన హాస్టల్‌ సిబ్బంది ఆమె గది కిటికీని బద్దలుకొట్టి చూడగా.. లోపల ఆ యువతి నగ్నంగా పడిఉంది.

దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. యువతిపై తొలుత అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మంగళవారం తెల్లవారుజామునే యువతి హత్యకు గురైనట్లు తేల్చారు. హాస్టల్‌ సెక్యూరిటీ గార్డు ప్రకాశ్ కనోజియానే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ఘటన జరిగిన తర్వాత కొద్దిసేపటికి అతడు మెయిన్‌ గేట్‌ నుంచి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. అతడి కోసం గాలింపు చేపట్టారు. అయితే, మంగళవారం సాయంత్రం సమీపంలోని రైలు పట్టాలపై అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువతిపై హత్యచారం చేసి.. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని