
నకిలీ యాప్‌లతో కొత్త తరహా మోసం
8 మందిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
దుకాణదారులు జాగ్రత్తగా ఉండాలన్న సీపీ అంజనీకుమార్
నారాయణగూడ: ఎలాగైనా డబ్బు సంపాదించాలని కొంత మంది యువకులు అడ్డదారి తొక్కారు. ప్లే స్టోర్‌లోని నకిలీ యాప్‌ల ద్వారా నగదు చెల్లింపులు చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇటువంటి యాప్‌లతో దుకాణదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
‘‘పాతబస్తీకి చెందిన 8 మంది (మహ్మద్ ముస్తఫా సేన్, సయ్యద్ అమీర్ హసన్, సయ్యద్ ఇలియాస్, సయ్యద్ వజీర్ అలీ, హఫిజ్ రానా, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అబ్దుల్ షాహిద్, యూసఫ్) ఎలాగైనా డబ్బులు సంపాదించాలని యూట్యూబ్‌లో పలు వీడియోలు చూశారు. వాటి ఆధారంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి నకిలీ పేటీఎం, గూగుల్ పే యాప్‌లను డౌన్‌లోడ్ చేశారు. ఈ క్రమంలో వివిధ దుకాణాలకు వెళ్లి సరకులు, దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు చేశారు. బార్‌కోడ్, ఖాతా వివరాలు ఆ నకిలీ యాప్‌లో నమోదు చేసి నగదు చెల్లింపులు చేపట్టారు. అయితే ఈ నకిలీ యాప్‌లలో నగదు వెళ్లినట్లు చూపిస్తుంది కానీ, వాస్తవానికి దుకాణదారుడి ఖాతాలోకి ఆ నగదు జమ కాదు. వెళ్లినట్లు మొబైల్‌కు మెసేజ్ కూడా రాదు. దుకాణ యజమానులు ఆ నగదు ఖాతాలో పడ్డాయా? లేదా అని నిర్ధారణ చేసుకునేలోపే వీరు అక్కడి నుంచి పరారయ్యేవారు’’ అని సీపీ వివరించారు. ఈ వ్యవహారంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సహాయంతో బుధవారం నిందితులను అరెస్టు చేశారు.
నిందితుల వద్ద నుంచి రూ.28 వేల విలువ చేసే 22 ప్యాంట్లు, 20 షర్ట్‌లు, రూ.8.5 వేల క్రీడా సామగ్రి, రూ.70 వేల గృహ సామగ్రి, రూ.28 వేల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ వివరించారు. ఇలాంటి నకిలీ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
ఇవీ చదవండి..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.