పోలీసుస్టేషన్‌ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి

పోలీసు స్టేషన్‌ ఆవరణలో వైకాపా నాయకులు హల్‌చల్‌ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్‌పై స్టేషన్‌ ఆవరణలోనే దాడి చేశారు.

Published : 26 Apr 2024 03:20 IST

దాచేపల్లి న్యూస్‌టుడే: పోలీసు స్టేషన్‌ ఆవరణలో వైకాపా నాయకులు హల్‌చల్‌ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్‌పై స్టేషన్‌ ఆవరణలోనే దాడి చేశారు. బాధితుడి కథనం మేరకు.. గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త ఆటో జానీ బుధవారం గురజాల నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి హాజరై వచ్చారు. మద్యం తాగి అదే గ్రామానికి చెందిన యూసఫ్‌ ఇంటి ముందు గొడవ చేశాడు.

అంతటితో ఆగకుండా ఆయన బంధువు నబిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం రాత్రి దాచేపల్లి పోలీసులు యూసఫ్‌ను, నబిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తుండగా.. స్ధానిక సర్పంచి ఇమామ్‌ వలి, ఆయన తమ్ముడు నాగులుతో కలిసి ఆటో జానీ అక్కడికి చేరుకున్నారు. స్టేషన్‌ ఆవరణలోనే యూసఫ్‌పై దాడి చేశారు. ‘ఇంకా 18రోజులు వైకాపాకు అధికారం ఉంది. ఎవరు వస్తారో రండి’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని బాధితుడు ఆరోపించారు. గాయపడిన యూసఫ్‌ను 108వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని