పాటలు వింటూ చిరుతకు బలి..!

ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ బాలిక హెడ్‌ఫోన్ల ద్వారా పాటలు వింటూ చిరుతపులికి బలయింది.

Published : 08 Jun 2020 12:06 IST

రుద్రపూర్‌: హెడ్‌ఫోన్స్‌లో పాటలు వింటూ ఓ బాలిక చిరుతపులి బారినపడింది. ఈ దుర్ఘటన ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బైల్‌పారో అటవీ ప్రాంత సమీపంలో చౌనాఖాన్‌ గ్రామానికి చెందిన మమత అనే బాలిక 8వ తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం తమ ఇంటి వద్ద ఉన్న ఓ కాలువ ఒడ్డున కూర్చుని హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటోంది. ఈలోగా బాలికపై ఓ చిరుతపులి హఠాత్తుగా దాడిచేసి అడవిలోకి లాక్కెళ్లింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ హెడ్‌ఫోన్‌, దువ్వెన లభించినట్టు వారు తెలిపారు. అనంతరం ఆడవిలోని పొదల్లో బాలిక మృతదేహం లభించినట్టు అధికారులు వివరించారు. బాలిక పాటలు వింటూ ఉండటంతో.. పులి వచ్చినట్టు గుర్తించలేదని వారు అంటున్నారు.

ఈ సంఘటనతో కుమౌన్‌ ప్రాంతంలో చిరుత దాడిలో మరణించిన వారి సంఖ్య ఒక్క నెలలో ఎనిమిదికి చేరింది. బాలికను చంపిన ఆ చిరుతను బంధించటానికి అటవీశాఖ సిబ్బంది రెండు బోన్లు, ఏడు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ చిరుత బాలికను చంపిన చోటికి మళ్లీ వచ్చి కెమెరా కంటికి చిక్కింది. అయితే, అది అక్కడే ఉన్న బోను సమీపానికి వచ్చినప్పటికీ... గ్రామస్థుల అలికిడి విని అక్కడి నుంచి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. చిరుతను పట్టుకునేందుకు బోనులు ఉంచిన ప్రదేశాలను మళ్లీ మారుస్తామని వారు వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వారికి రాష్ట్రప్రభుత్వం తరపున రూ.3 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు