ఉద్యోగాల క్రమబద్ధీకరణ పేరుతో లంచాలు

తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్‌ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది.

Published : 10 May 2024 05:53 IST

తపాలాశాఖ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని చెబుతూ లంచాలు వసూలు చేయడంపై హైదరాబాద్‌ సీబీఐ విభాగం తపాలాశాఖ ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. తనకంటే జూనియర్లుగా ఉన్న సురేంద్రకుమార్‌, బీటీసింగ్‌ల నుంచి తపాలాశాఖ హైదరాబాద్‌ డివిజన్‌.. సార్టింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మాధవి లంచం తీసుకొని పదోన్నతులిచ్చారని ఎండీ ఖలీముద్దీన్‌ అనే తాత్కాలిక ఉద్యోగి 2023 జనవరి 7న ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తాను రూ.1.5 లక్షలు లంచం ఇచ్చి శాశ్వత నియామక ఉత్తర్వులు తెచ్చుకున్నానని బీటీసింగ్‌ విచారణాధికారుల వద్ద అంగీకరించారు. దీనికి సంబంధించి సురేంద్ర తనకు, మాధవికి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ ఆడియో రికార్డింగ్‌ను ఉన్నతాధికారులకు అందించారు. మొత్తం 18 మంది తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడానికి మాధవి రూ.18 లక్షలు అడుగుతున్నట్లు ఆడియోలో స్పష్టంగా ఉంది. ఇంకో ఆడియోలో మరో 16 మంది ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడానికి రూ.20 లక్షలు అడిగినట్లు కూడా ఉంది. దీనిపై విచారణ మొదలయ్యాక మాధవి తనను బెదిరించారని, తాను చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయన్నారని పేర్కొన్నారు. తాను డబ్బు తిరిగి ఇస్తానని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దన్నారని కూడా సురేంద్రకుమార్‌ వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీని ఆడియో క్లిప్‌నూ అందించారు. తన ఉద్యోగానికి రూ.2 లక్షలు, బీటీసింగ్‌ కోసం 1.50 లక్షలు మాధవికి ఇచ్చామన్నారు.  విచారణ మొదలుకావడంతో మాధవి, శ్రవణ్‌కుమార్‌ అనే మరో ఉద్యోగి.. తమను పిలిచి, రూ.2.4 లక్షలు తిరిగిచ్చేశారని, ఈ మొత్తం ప్రక్రియలో లంచాల ప్రస్తావన రాలేదని వాంగ్మూలం ఇవ్వాలని తనను బలవంతం చేశారంటూ సురేంద్రకుమార్‌ తెలిపారు. దీనిపై తపాలాశాఖ ఉన్నతాధికారులు రాసిన లేఖ ఆధారంగా హైదరాబాద్‌ సీబీఐ విభాగం ఈ నెల 8న సీహెచ్‌ మాధవి, సురేంద్రకుమార్‌, బీటీసింగ్‌లపై కేసు నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని