సజ్జల భార్గవ్‌రెడ్డిపై సీఐడీ కేసు నమోదు

వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్‌, 171-జీ, 505(2) రెడ్‌విత్‌ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది.

Updated : 10 May 2024 06:52 IST

చంద్రబాబు మీద దుష్ప్రచారంపై ఫిర్యాదు
ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డిపై సీఐడీ గురువారం కేసు నమోదు చేసింది. 171-ఎఫ్‌, 171-జీ, 505(2) రెడ్‌విత్‌ 120-బీ సెక్షన్ల కింద కేసు పెట్టింది. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వనివ్వకుండా తెదేపా అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని భార్గవ్‌రెడ్డి దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ నెల 4న ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈవో.. ఇలాంటి చర్యలు ఎన్నికల ప్రవర్తనా నిమయావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐడీ డీజీ(సైబర్‌ సెల్‌)కి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ‘‘సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్ద ఇవ్వనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారంటూ పింఛన్‌దారులకు వైకాపా వాళ్లు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తున్నారు. వైకాపాకు లబ్ధి చేకూర్చాలని సజ్జల భార్గవ్‌రెడ్డే ఇవన్నీ చేయిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోండి’’ అని వర్ల రామయ్య తన ఫిర్యాదులో సీఈవోను కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే భార్గవ్‌రెడ్డిపై కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని