ఈత సరదా మిగిల్చిన విషాదం

వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

Published : 10 May 2024 05:53 IST

మున్నేరులో మునిగి ముగ్గురు బాలుర మృతి

ఖమ్మం గ్రామీణం, ఖమ్మం నేరవిభాగం- న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో సరదాగా ఈత కోసం వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు మున్నేరులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలంలోని గుదిమళ్ల సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఆటో డ్రైవర్‌ ఆముదాల చిరంజీవి, అతని ఇద్దరు కుమారులు లోకేశ్‌(14), హరీశ్‌(12), వారి ఇంటి పక్కనే ఉండే గణేశ్‌(14) కలిసి చేపల వేట, ఈత కోసం మున్నేరు నది వద్దకు వెళ్లారు. ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా ధంసలాపురం, గుదిమళ్ల గ్రామాల మధ్య మున్నేరు నదిలో గుంతలు తవ్వి వదిలేశారు. ఓ పిల్లరు కోసం తవ్విన గుంత వద్దకు ఈ నలుగురూ వెళ్లారు. చిరంజీవి ఓ వైపు ఒడ్డున ఉండి చేపలు పడుతుండగా, మరో ఒడ్డున ముగ్గురు పిల్లలు కలిసి ఈత కొడుతున్నారు. గుంత లోతుగా ఉండటంతో అందులో విద్యార్థులు గల్లంతయ్యారు. చిరంజీవి, కొంతమంది స్థానికులు కలసి వారికోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో లోకేశ్‌ భద్రాచలం గురుకులంలో ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. హరీశ్‌ ఖమ్మంలో అయిదో తరగతి చదివాడు. గణేశ్‌ కొణిజర్ల మండలం తనికెళ్ల గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. ఇతనికి తండ్రి లేడు. తల్లి కళావతి ఖమ్మంలో రాగిజావ విక్రయిస్తూ జీవిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని