బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు

బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు.

Published : 10 May 2024 05:52 IST

పది మంది దుర్మరణం
11 మందికి గాయాలు

చెన్నై (ప్యారీస్‌), న్యూస్‌టుడే: బాణసంచా పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలుడు ధాటికి 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు... తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశీకి చెందిన శరవణన్‌.. సెంగమలపట్టి వద్ద బాణసంచా పరిశ్రమ నడుపుతున్నారు. అక్కడ ఉన్న 30కి పైగా గదుల్లో 50 మంది పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కార్మికులు ఓ గదిలో టపాసులు తయారు చేస్తుండగా రాపిడి కలిగి పేలుడు సంభవించింది. ఆ ధాటికి 8 గదులు నేలమట్టం కాగా మంటలు పక్కనే ఉన్న గదుల్లోకి వ్యాపించడంతో కార్మికులు పరుగులు తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనలో 10 మంది మృతి చెందగా వారిని అయ్యంపట్టికి చెందిన లక్ష్మి (37), ముదలిపట్టికి చెందిన విజయకుమార్‌ (28), సెంట్రల్‌ చెన్నైకి చెందిన రమేష్‌ (31), వి.చొక్కలింగపురానికి చెందిన కాళీశ్వరన్‌ (47), అలగర్‌ స్వామి (35), జయకుమార్‌, పేచ్చియమ్మాళ్‌, జయలక్ష్మి, వసంతి, లక్ష్మిగా గుర్తించారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతులకు సీఎం స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని