Updated : 01 Jul 2022 06:20 IST

‘పది’ ఫలితం రోజే.. అమ్మానాన్న దూరం!

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

న్యూస్‌టుడే - మిరుదొడ్డి, సిద్దిపేట అర్బన్‌:  పదో తరగతిలో బాలిక 9.8 జీపీఏతో ఉత్తమ ఫలితాన్ని సాధించినా సంతోషపడే పరిస్థితి లేదు. భవిష్యత్తు అంధకారబంధురంగా, అగమ్యగోచరంగా కనిపిస్తోంది. కారణం.. ఫలితాలకు కొద్ది గంటల ముందే గురువారం తెల్లవారుజామున అమ్మానాన్నలు సిద్దిపేట బైపాస్‌పై రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ చనిపోయారు. సిద్దిపేట జిల్లా కాసులాబాద్‌కు చెందిన నల్లనాగుల తిరుమలేశ్‌ (40), మిరుదొడ్డికి చెందిన బాలమణి (36) దంపతులు. వీరికి పదో తరగతి పూర్తయిన కుమార్తె రాజేశ్వరి, ఆరో తరగతి చదువుతున్న కుమారుడు వరుణ్‌ ఉన్నారు. వీరి కుటుంబం మిరుదొడ్డిలో కిరాయి ఇంట్లో ఉంటున్నారు. తిరుమలేశ్‌ దర్జీ పని, బాలమణి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో రాజేశ్వరి పదో తరగతి చదవగా గురువారం వచ్చిన ఫలితాల్లో ఉత్తమంగా పాసైంది. సిద్దిపేట మండలం జక్కాపూర్‌లో బుధవారం బంధువుల అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరిగి స్వగ్రామానికి బైక్‌పై తూప్రాన్‌ పట్టణానికి చెందిన బావ రమేశ్‌, దంపతులు వస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్సాన్‌పల్లి బైపాస్‌ వద్ద వాహనం అదుపు తప్పి కంకర కుప్పను ఢీకొంది. రమేశ్‌ శిరస్త్రాణం ధరించడంతో స్వల్ప గాయాలయ్యాయి. దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి మెరుగైన చికిత్సకు తరలించారు. గురువారం తెల్లవారుజామున పదిహేను నిమిషాల వ్యవధిలో దంపతులు మృతి చెందారు. మృతురాలి సోదరి లలిత ఫిర్యాదు మేరకు సిద్దిపేట రూరల్‌ ఠాణాలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్‌.కిరణ్‌రెడ్డి తెలిపారు. ఒకేరోజు తల్లిదండ్రులు మృతి చెందడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అమ్మానాన్నలను కోల్పోయిన బాలల స్థితికి యువత స్పందించి మానవత్వం చాటుకుంది. రూ.50 వేలు విరాళంగా పోగు చేసుకొని అందించారు. ఎమ్మెల్సీ ఫారుఖ్‌ హుస్సేన్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని