దేశ రాజధానిలో బాంబు పేలుడు

దేశరాజధాని దిల్లీ నడిబొడ్డులో బాంబు విస్ఫోటం కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రోడ్డులోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి 150 మీటర్ల దూరంలో శుక్రవారం

Updated : 30 Jan 2021 15:31 IST

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వెలుపల ఘటన
ఎవరికీ గాయాలు కాలేదు: అధికారులు
దేశవ్యాప్తంగా అప్రమత్తత

దిల్లీ: దేశరాజధాని దిల్లీ నడిబొడ్డులో బాంబు విస్ఫోటం కలకలం సృష్టించింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రోడ్డులోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి 150 మీటర్ల దూరంలో శుక్రవారం సాయంత్రం 5.05 గంటలకు ఈ పేలుడు సంభవించింది. ఇందులో ఎవరూ గాయపడలేదు. పేలుడు తీవ్రతకు మూడు కార్ల అద్దాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో.. ఘటనా స్థలానికి 1.5 కిలోమీటర్ల దూరంలోని విజయ్‌ చౌక్‌లో గణతంత్ర దినోత్సవ ముగింపు కార్యక్రమం ‘బీటింగ్‌ రిట్రీట్‌’ జరుగుతోంది. అందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు. దీంతో అధికార యంత్రాంగం ఉలికిపాటుకు గురైంది.
ఘటనా స్థలం మొత్తాన్నీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకొని, గాలింపు చేపట్టారు. జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ), దిల్లీ పోలీసులోని ప్రత్యేక విభాగం, సీనియర్‌ పోలీసు అధికారులు హుటాహుటిన ఇక్కడికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. తాజా ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దిల్లీ పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు కోసం తక్కువ తీవ్రత కలిగిన ఐఈడీ బాంబును దుండగులు ఉపయోగించినట్లు చెప్పారు. సంచలనం సృష్టించడానికి జరిగిన ఆకతాయి ప్రయత్నంగా దీన్ని భావిస్తున్నామన్నారు. రాయబార కార్యాలయానికి వెలుపల పూల కుండీలో బాంబును ఉంచినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ)లోని బాంబు నిర్వీర్యక విభాగాన్ని అప్రమత్తం చేశారు. బాంబులో ఉపయోగించినట్లు భావిస్తున్న చిన్నపాటి బాల్‌ బేరింగ్స్‌ను, కొన్ని లోహపు వస్తువులను ఫోరెన్సిక్‌ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో కూడిన సీసా, రాయబార కార్యాలయ చిరునామాతో ఒక కవరు కూడా లభ్యమైనట్లు వార్తలు వచ్చాయి.
అంతటా అప్రమత్తత
పేలుడు నేపథ్యంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్‌) తన బలగాలను అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు, ఏరోస్పేస్‌ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.

తీవ్రంగా పరిగణిస్తున్నాం: జైశంకర్‌
ఈ ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గాబి ఆష్కెనాజితో మాట్లాడానని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ తెలిపారు. పేలుడును తీవ్రంగా పరిగణిస్తున్నామని, రాయబార కార్యాలయానికి, సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయనకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని చర్యలూ చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

భారత్‌పై విశ్వాసం: ఇజ్రాయెల్‌
పేలుడు ఘటనపై దర్యాప్తునకు, ఇజ్రాయెల్‌వాసుల భద్రతకు భారత అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటారన్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజిమెన్‌ నెతన్యాహు చెప్పారు. పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌.. ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా సలహాదారు మెయిర్‌ బెన్‌ షాబత్‌తో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయనకు తెలియజేశారు. ఈ వివరాలు నెతన్యాహకూ అందినట్లు అధికారులు తెలిపారు.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని