
ఆశల సాగు.. ఆయువు తీసింది
వర్షాలకు పంటలు దెబ్బతిని రైతు ఆత్మహత్య
చిన్నమంతూరు (రొద్దం), న్యూస్‌టుడే : ఇంజినీరింగ్ పూర్తి చేసినా సాగులో అద్భుతాలు సృష్టించాలని హలం పట్టిన అనంతపురం జిల్లా రొద్దం మండలం చిన్నమంతూరుకు చెందిన యువరైతు నవీన్‌కుమార్(24) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల మేరకు.. చిన్నమంతూరుకు చెందిన గోపాల్‌నాయుడు, జయలక్ష్మమ్మల కుమారుడు నవీన్‌కుమార్ 2019లో బీటెక్ (మెకానికల్) పూర్తి చేశారు. అదే ఏడాది తండ్రి గోపాల్‌నాయుడు ప్రమాదవశాత్తు మృతి చెందారు. తల్లికి తోడుగా ఉంటూ నవీన్‌కుమార్ వ్యవసాయంపై మొగ్గుచూపారు. తమకు ఉన్న 12 ఎకరాల్లో.. 8 ఎకరాల్లో పత్తి, టమోటా సాగు చేశారు. అప్పు చేసి రూ.80 వేలు పెట్టుబడి పెట్టారు. భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిని పైసాకూడా చేతికందని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్తాపానికి గురైన అతను సోమవారం ఉదయం తల్లి పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లో పైకప్పునకు ఉరి వేసుకున్నాడు. ఉన్న ఒక్క కొడుకు దూరంకావడంతో తల్లి రోదించిన తీరు అక్కడివారిని కలచివేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.