
ప్రాణం తీసిన మాంజా
వాహనంపై వెళ్తుండగా మెడ కోసుకుని ఒకరి మృతి
మరో ఘటనలో ఒకరికి తీవ్ర గాయం
మంచిర్యాల నేరవిభాగం, బాన్సువాడ, న్యూస్‌టుడే: పతంగుల మాంజా చుట్టుకొని ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డ సంఘటనలు మంచిర్యాల, కామరెడ్డిలతో శనివారం జరిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న పాస్తం భీమన్న (39) అనే వ్యక్తి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృత్యువాత పడ్డాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన భీమన్న పదిహేను సంవత్సరాల క్రితం మంచిర్యాలకు వలసవచ్చాడు. కూలి చేసుకొని జీవిస్తున్న భీమన్నకు భార్య శారద, కూతురు, కుమారుడు ఉన్నారు. మరో ఘటనలో బాన్సువాడ లోని తాడ్కోల్ చౌరస్తాలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఎజాజ్‌కు మాంజా దారం చుట్టుకొని గొంతు తెగి రక్తస్రావం జరగడంతో స్థానికులు బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి పంపించారు.
నిషేధించినా యథేచ్ఛగా అమ్మకాలు
గాలిపటాలకు వినియోగించే చైనా మాంజాను నిషేధిస్తూ ప్రభుత్వం 2016 జనవరి 13న జీవో నం.2ను విడుదల చేసింది. ఆ మాంజాను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మాంజాను విక్రయిస్తూ పట్టుబడితే రూ.5 లక్షల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయినప్పటికీ మార్కెట్లలో ఈ మాంజా లభిస్తోంది. సాధారణ దారంతో పోల్చితే దీని ధర తక్కువగా ఉండడంతో వీటికి డిమాండ్ ఉంది. పోలీసు నిఘా లేకపోవడంతో యథేచ్ఛగా చైనా మాంజాను బహిరంగంగానే అమ్ముతున్నారు. గుజరాత్, ముంబయి, పంజాబ్‌తో పాటు హైదరాబాద్ నుంచి జిల్లాలకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. వీటి ధర ఒక చరక్ మాంజా రూ.1000 పలుకుతోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.