జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. వాహనంపై బోధన్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌

ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండున్నర నెలలున్న పసికందు మృతిచెందగా ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు

Published : 18 Mar 2022 06:54 IST

రెండున్నర నెలల పసికందు మృతి

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో రెండున్నర నెలలున్న పసికందు మృతిచెందగా ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు. స్థానికుల, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాదాపూర్‌ నుంచి టీఆర్‌ నంబరుతో ఉన్న వాహనం తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45లోని బ్రిడ్జిని దాటి, రోడ్‌ నంబరు 1/45 కూడలి వైపు వేగంగా వస్తోంది. ఈ క్రమంలో బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. అక్కడే పిల్లలను ఎత్తుకొని బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కాజల్‌చౌహాన్‌, సారిక చౌహాన్‌, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టింది. దీంతో కాజల్‌ చౌహాన్‌ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్‌ చౌహాన్‌, సారిక చౌహాన్‌ చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్‌ సైతం కిందపడ్డారు. రణవీర్‌ చౌహాన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మహిళలకు గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి రోడ్‌ నంబరు 1 వైపు పరారయ్యాడు. స్థానికులు, ట్రాఫిక్‌ పోలీసులు వారిని 108లో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. చిన్నారి రణవీర్‌చౌహాన్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కారుపై బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ మహమ్మద్‌ పేరుతో స్టిక్కర్‌ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని