Published : 20 May 2022 05:36 IST

బోధన్‌ కుంభకోణంలో 9 వేల పేజీల నివేదిక

ప్రతి పేజీ పైనా ఫోరెన్సిక్‌ నిపుణుల సంతకం, స్టాంపు
త్వరలో సీఐడీకి సమర్పణ
కొలిక్కి రానున్న ఆరేళ్ల దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌: బోధన్‌ వాణిజ్య పన్నుల కుంభకోణంలో ఫోరెన్సిక్‌ నిపుణులు ఏకంగా 9 వేల పేజీలతో నివేదిక సిద్ధం చేయడం సంచలనం సృష్టిస్తోంది. రెండు నెలల కిందటే ఇది సిద్ధమైనప్పటికీ ప్రతి పేజీపైనా సంతకం చేసి స్టాంపు వేయాల్సి ఉన్నందున సీఐడీకి సమర్పించడంలో జాప్యమవుతోంది. ఇది అందిన వెంటనే సీఐడీ అధికారులు అభియోగపత్రం దాఖలు చేసే అవకాశం ఉంది. దాంతో ఆరేళ్లుగా జరుగుతున్న దర్యాప్తు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... వాణిజ్యపన్నుల అధికారులు అక్రమాలకు పాల్పడ్డట్లు ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. బోధన్‌ వాణిజ్య పన్నుల కార్యాలయం కేంద్రంగా జరిగిన భారీ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాల మేరకు 2016లో సీఐడీ కేసు నమోదు చేసింది. వాణిజ్య పన్నుల చెల్లింపులో దళారీగా వ్యవహరిస్తున్న శివరాజ్‌ అనే వ్యక్తి అధికారులను ప్రలోభపెట్టి ఈ కుంభకోణానికి పాల్పడ్డాడు. ఒకటే చలానాను ఇద్దరు వ్యక్తులు చెల్లించినట్లు చూపించేవాడు. రెండు వేర్వేరు సంస్థలు చెరో రూ.లక్ష చొప్పున పన్ను చెల్లించాలంటే ఇద్దరినుంచీ రూ.2 లక్షలు వసూలు చేసేవాడు. కానీ రూ.లక్షకు మాత్రమే చలానా తీసుకొని దాన్నే రెండు సంస్థల పేర్లమీదా పన్ను చెల్లించినట్లు చూపేవాడు. వాణిజ్యపన్నుల శాఖ కంప్యూటర్లలో రెండు సంస్థలు పన్ను చెల్లించినట్లు కనిపించేది కానీ డబ్బు ప్రభుత్వ ఖజానాలో జమయ్యేది కాదు.

వాస్తవానికి ప్రభుత్వ ఆడిట్‌లో ఇది బయటపడాలి. కానీ అధికారులు ఉద్దేశపూర్వకంగా మౌనం వహించడంతో వెలుగులోకి రాలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం కల్పించుకొని దర్యాప్తునకు ఆదేశించింది. ఇందులో భాగంగా సీఐడీ అధికారులు వేలకొద్దీ చలానాలు, డీడీలు, చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు పన్నుల చెల్లింపులు ఆన్‌లైన్లోనే జరుగుతున్నాయి కాబట్టి వాణిజ్యపన్నులశాఖ సర్వర్‌లో సంస్థల వారీగా జమ అయిన పన్ను, బోధన్‌ కార్యాలయంలోని కంప్యూటర్లలో నమోదు చేసిన పన్నులను సరిపోల్చాల్సి ఉంది. ఆ శాఖ సర్వర్లలో హార్డ్‌ డిస్కులకు సంబంధించి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని సీఐడీ అధికారులు భావించారు. కానీ వాటిని తీస్తే తమ దైనందిన కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యం కాదని వాణిజ్యపన్నుల అధికారులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఈ హార్డ్‌ డిస్కులను స్వాధీనం చేసుకున్న ఫోరెన్సిక్‌ నిపుణులు వీటిలో నిక్షిప్తమైన, అప్పటికే డిలీట్‌ చేసిన డేటాను తిరిగి వెలికితీశారు. ఈ సమాచారమంతా కాగితాలపై ముద్రించారు. అనేక ఉత్తుత్తి ఎంట్రీలు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ అధికారులు గుర్తించారని సమాచారం. న్యాయవిచారణకు ఇదే కీలకం కానుంది. ఫోరెన్సిక్‌ నిపుణులు పత్రాలపై సంతకం, స్టాంపు తంతు ముగియగానే సీఐడీకి నివేదిక అందించే అవకాశం ఉంది.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని