రహదారులపై మృత్యుఘంటిక

రాష్ట్రంలోని రహదారులపై మృత్యుఘంటిక మోగింది. సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో గురువారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ గ్రామానికి చెందిన కొందరు

Published : 27 May 2022 06:10 IST

మూడు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం
12 మందికి తీవ్రగాయాలు

జగదేవపూర్‌, సత్తుపల్లి, ముదిగొండ-న్యూస్‌టుడే: రాష్ట్రంలోని రహదారులపై మృత్యుఘంటిక మోగింది. సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో గురువారం జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 9 మంది దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్‌ గ్రామానికి చెందిన కొందరు మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌ గ్రామంలో జరగనున్న ఓ సంవత్సరీకం కార్యక్రమానికి ఆటోలో బయలుదేరారు. జగదేవపూర్‌ మండలం అలిరాజపేట శివారులోని ఓ మూలమలుపులో గజ్వేల్‌ వైపు నుంచి ఎదురుగా దూసుకువచ్చిన ఓ కంటెయినర్‌ లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ శ్రీగిరిపల్లి కనకయ్య(32), కవిత (30) అక్కడికక్కడే మరణించగా.. చంద్రయ్య(45), లలిత(38) హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు క్షతగాత్రులయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి వెళ్తున్న కారు ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్‌ టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది. సత్తుపల్లిలోని మెట్టాంజనేయ స్వామి ఆలయం దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురానికి చెందిన కొడాలి రంగరాజు(45), భానుమతి(75) మృతి చెందారు. వివాహం అనంతరం నిర్వహించే నోముల కార్యక్రమంలో వీరు ఆంధ్రప్రదేశ్‌ నుంచి సత్తుపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లలోని 8 మంది గాయపడ్డారు. మరో ప్రమాదంలో.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామ శివారులో కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇదే జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(55), తమలపాకుల హర్షవర్ధన్‌(7), కారేపల్లి మండలం కొత్తకమలాపురం గ్రామానికి చెందిన చాగంటి రమేశ్‌(36) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు గాయాలపాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని