Fake Certificates: నకిలీ దందాతో అ‘ధనం’!

ప్రముఖ విశ్వవిద్యాలయాల డిగ్రీ, పీజీ విద్యార్హతల నకిలీ ధ్రువపత్రాలను రూపొందిస్తున్న ముఠాను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 06 Jul 2022 12:03 IST

బోగస్‌ ధ్రువపత్రాల తయారీతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అక్రమ సంపాదన

కన్సల్టెన్సీలతో జట్టు కట్టి యువతకు వల

ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు

జైలుకెళ్లిన నలుగురు నిందితులు

ఈనాడు, హైదరాబాద్‌ నాగోలు, న్యూస్‌టుడే: ప్రముఖ విశ్వవిద్యాలయాల డిగ్రీ, పీజీ విద్యార్హతల నకిలీ ధ్రువపత్రాలను రూపొందిస్తున్న ముఠాను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. భద్రాది కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని రావులపాడుకు చెందిన వడ్డే రోహిత్‌కుమార్‌(27) ఎంఎస్‌ పూర్తి చేశాడు. హైటెక్‌సిటీలోని క్రిటికల్‌ రివర్‌ ఐటీ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌వేర్‌ టెస్ట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ఫొటోల ఎడిటింగ్‌లో ప్రావీణ్యం ఉంది. దీని సాయంతో అదనపు సంపాదన కోసం ఫోర్జరీ సంతకాలతో నకిలీ విద్యార్హతల పత్రాలను తయారు చేయటం ప్రారంభించాడు. అవతలి వారి అవసరానికి అనుగుణంగా నకిలీ పత్రం ఒక్కోదానికి రూ.లక్ష వరకూ వసూలు చేసేవాడు. గుంటూరుకు చెందిన వి.శ్రీనివాసరావు(25) అనే స్నేహితుడిని మధ్యవర్తిగా మార్చి విద్య, ఉద్యోగాల కన్సల్టెన్సీలతో లావాదేవీలు ప్రారంభించాడు. అలా సరూర్‌నగర్‌లో ఎస్‌ఎల్‌ ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న సిరిసాల లక్ష్మి(30)తో అవగాహన కుదిరింది.

డొంక ఎలా కదిలిందంటే
కొత్తపేట న్యూమారుతీనగర్‌కు చెందిన యువకుడు సాధు జితేందర్‌ ఇంటర్‌ చదివాడు. డిగ్రీ చదువులకు విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. 3 నెలల క్రితం లక్ష్మి నిర్వహించే కన్సల్టెన్సీని సంప్రదించాడు. అమెరికా వెళ్లేందుకు ఇంటర్మీడియట్‌ విద్యార్హతల పత్రాలను వారికి ఇచ్చాడు. వీసా, డాక్యుమెంటేషన్‌కు రూ.లక్ష ఖర్చవుతుందని ఆమె చెప్పటంతో రూ.50,000 ఫోన్‌ పే ద్వారా చెల్లించాడు. కొద్దిరోజుల తరువాత కన్సల్టెన్సీ నుంచి కొన్నిపత్రాలు అతడికి ఇచ్చారు. వాటి ద్వారా వీసాకు దరఖాస్తు చేసుకోమంటూ సూచించారు. మిగిలిన రూ.50వేల నగదు వారికిచ్చి కవర్‌ తీసుకొని ఇంటికొచ్చాడు. దానిలో అతను కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసినట్లు సంబంధిత మార్కుల మెమో, మాస్టర్స్‌ చదివేందుకు ఓ సిఫారసు పత్రాన్ని ఇచ్చినట్టు గ్రహించాడు. డిగ్రీ చదవడానికి అమెరికా వెళ్లానుకున్న తనకు ఏకంగా డిగ్రీ సర్టిఫికెట్‌ అందించడంతో అవాక్కైన జితేందర్‌ తన కుటుంబ సభ్యులకు విషయం తెలపడంతో వారి సూచన మేరకు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ బృందం సహకారంతో కూపీ లాగటంతో నకిలీపత్రాల తయారీ డొంక కదిలింది. కన్సల్టెంట్‌ సంస్థ ఎండీ, లక్ష్మి, రోహిత్‌కుమార్‌, శ్రీనివాసరావు, గారేపల్లి సాయి ప్రణవ్‌(25)లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి నకిలీ డిగ్రీ, ప్రొవిజనల్‌, రికమండేషన్‌, స్టడీ, కాండక్ట్‌, టీసీ, ఎక్స్‌పీరియన్స్‌ తదితర 110 ధ్రువపత్రాలు, ల్యాప్‌ట్యాప్‌, ప్రింటర్‌, రబ్బరుస్టాంపులు, నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 20మందికి నకిలీ ధ్రువపత్రాలు ఇప్పించి విదేశాలకు పంపినట్లు గుర్తించారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేసి వాటాలు పంచుకున్నట్టు నిర్ధారించారు. నకిలీ ధ్రువపత్రాలతో దేశం దాటుతున్న విద్యార్థులు అక్కడి ఇమిగ్రేషన్‌ అధికారులకు పట్టుబడితే కేసుల్లో చిక్కుకునే అవకాశం ఉందని సీపీ మహేష్‌ భగవత్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని