ఠాణాలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

జిల్లా కేంద్రం నంద్యాలలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌ బోయ రామకృష్ణ (36) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 03 Dec 2022 04:14 IST

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రం నంద్యాలలోని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌ బోయ రామకృష్ణ (36) శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, మృతుడి తల్లి వెంకటసుబ్బమ్మ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో నివాసం ఉంటున్న బోయ రామకృష్ణకు భార్య, ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. రామకృష్ణ బాల్యంలోనే తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి తల్లి గారి గ్రామమైన శిరివెళ్ల మండలం కోటపాడులో ఉంటూ చదువుకున్నారు. 2011లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు. ఆళ్లగడ్డ, సంజామల పోలీసు స్టేషన్లలో పనిచేసి జులైలో నంద్యాల మూడో పట్టణ ఠాణాకు బదిలీపై వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి విధుల కోసం స్టేషన్‌కు వెళ్లారు. రోల్‌లో ఫొటో దిగిన వెంటనే స్టేషన్‌పైన ఉన్న విశ్రాంతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గుర్తించిన ఓ కానిస్టేబుల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్పీ రఘువీర్‌రెడ్డి, డీఎస్పీ మహేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రామకృష్ణ తన ఫోన్‌ అన్‌లాక్‌ సంఖ్యను ఒక పేపరులో రాసినట్లు సమాచారం. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నారని, అందుకే అన్‌లాక్‌ సంఖ్యను రాసి పెట్టినట్లు తెలిసింది. దీనిపై డీఎస్పీని వివరణ కోరగా.. ఎలాంటి వీడియోలు లేవన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుమారుడి ఆత్మహత్య సమాచారం అందుకున్న తల్లి, భార్యాపిల్లలు స్టేషన్‌కు చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తల్లి వెంకటసుబ్బమ్మ కింద పడిపోయి గుండెలవిసేలా రోదించడం చూపరులను కలచివేసింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని