Viral video: ట్రాక్టర్‌తో స్టంట్‌మ్యాన్‌ విన్యాసాలు ప్రదర్శిస్తుండగా..!

ట్రాక్టర్‌తో విన్యాసాలు ప్రదర్శిస్తూ ఓ స్టంట్‌మ్యాన్‌ మృతిచెందాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Updated : 29 Oct 2023 19:16 IST

Image: Arvindkumar065

చండీగఢ్‌: పంజాబ్‌లోని (Punjab) గురుదాస్‌పుర్‌ జిల్లాలో నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ట్రాక్టర్‌తో విన్యాసాలు ప్రదర్శిస్తున్న ఓ స్టంట్‌మ్యాన్‌ ఆ వాహనం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. తాతే గ్రామానికి చెందిన సుఖ్‌మన్‌దీప్‌ సింగ్‌ (29) ట్రాక్టర్‌తో స్టంట్స్‌ చేయడంలో దిట్ట. గతంలో పలు టీవీ ఛానళ్లలో అతను చేసిన స్టంట్స్‌ ప్రసారమయ్యాయి. సుఖ్‌మన్‌దీప్‌ భార్య పంజాబ్‌ పోలీసు శాఖలో పనిచేస్తోంది. వారికి ఓ కుమారుడు ఉన్నాడు. 

కన్నతల్లిపై ఓ న్యాయవాది కర్కశత్వం

ఫతేగఢ్‌ ఛురియన్‌ నియోజకవర్గంలోని సర్చూర్‌ గ్రామంలో క్రీడా పోటీలు నిర్వహిస్తుండటంతో సుఖ్‌మన్‌ అక్కడికి వెళ్లాడు. నిర్వాహకులు సిద్ధం చేసిన మైదానంలో తన ట్రాక్టర్‌ ముందు చక్రాలను గాల్లోకి లేపి కిందకి దిగాడు. ఆ వాహనం గింగిరాలు తిరుగుతుండగానే సుఖ్‌మన్‌ టైరు మీద కాలుపెట్టి డ్రైవరు సీట్లోకి వెళ్లే సాహసం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అతడిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. అప్పటికే వేగంగా తిరుగుతున్న ట్రాక్టర్‌ పలుమార్లు స్టంట్‌మ్యాన్‌పై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో తదుపరి క్రీడా ఉత్సవాలు రద్దయ్యాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఈ ఘటన జరిగిందని, విచారణ చేపడుతున్నామని గురుదాస్‌పుర్‌ డిప్యూటీ కమిషనర్‌ హిమాన్షు అగర్వాల్‌ తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని చెప్పారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించే వారికి మాత్రమే తాము అనుమతులు మంజూరు చేస్తామన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని