Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. మాయమైన పాత డేటా

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.గత కొన్నేళ్లుగా ఎస్‌ఐబీ ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు.

Updated : 08 Apr 2024 16:34 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) డీఎస్పీగా ఉన్న ప్రణీత్‌రావు చేసిన పనితో పోలీసు ఉన్నతాధికారులకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎస్‌ఐబీ ఎంతో శ్రమించి సేకరించిన పాత డేటా కూడా పోయినట్లు పోలీసులు తాజాగా గుర్తించారు. ఇందులో మావోయిస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు ప్రణీత్‌రావు డిసెంబర్‌ 4న మొత్తం 17 కంప్యూటర్లకు చెందిన 42 హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశాడు. వీటి నుంచి డేటాను తిరిగి పొందే అవకాశం కూడా లేదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. మూసీలో కలిపిన హార్డ్‌ డిస్క్‌ శకలాల నుంచి కూడా వీటిని పొందే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. 

మరోవైపు ట్యాపింగ్‌ కోసం కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ సమకూర్చిన టూల్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ల్యాబ్‌ డైరెక్టర్లుగా పాల్‌ రవికుమార్‌, బూసి, శీవల్లి గోడి ఉన్నారు. వీరిద్దరు మరో 6 సంస్థలకూ సీఈవోలుగా ఉన్నట్లు గుర్తించారు. వీరిని కూడా విచారించే అవకాశం ఉంది.  తొలుత ఎస్‌ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్‌రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్‌రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని