Mumbai: ఫేస్‌బుక్‌ లైవ్‌లో కాల్పులు.. శివసేన నేత మృతి

ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతుండగా శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన నేతపై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  

Published : 09 Feb 2024 01:31 IST

ముంబయి: శివసేన (ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం) (Shiv Sena UBT) నేత ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతుండగా దారుణ హత్యకు గురయ్యారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముంబయి (Mumbai)లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న సామాజిక కార్యకర్త మౌరిస్‌ నోరాన్హ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 

మాల్దీవుల వ్యవహారం.. బలగాల స్థానంలో సాంకేతిక సిబ్బంది!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివసేన (యూబీటీ) వర్గానికి చెందిన అభిషేక్‌ ఘోసాల్కర్‌ గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అతడి తండ్రి వినోద్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. స్థానిక ఉద్యమకారుడైన నోరాన్హ, అభిషేక్‌ల మధ్య కొంతకాలంగా వ్యక్తిగతవైరం ఉంది. ఈ క్రమంలో ముంబయిలోని బొరివిల్లీ ప్రాంతంలోని ఐసీ కాలనీ అభివృద్ధి పనుల కోసం మాట్లాడుకోవడానికి నోరాన్హ తన కార్యాలయానికి అభిషేక్‌ను ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన అభిషేక్‌ ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతుండగా నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. పొట్టలో, భుజంలోకి తూటాలు దూసుకెళ్లడంతో బాధితుడు కుప్పకూలాడు. గమనించిన స్థానికులు అభిషేక్‌ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం నోరాన్హ తనని తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాల్పుల ఘటన అంతా ఫేస్‌బుక్‌ లైవ్‌లో రికార్డు అయింది.   

ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) విచారణకు ఆదేశించగా, ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంపీ సంజయ్‌ రౌత్‌ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు కరవయ్యాయని మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. ఇటువంటి ఘటనే ఇటీవల మహారాష్ట్రలో చోటుచేసుకుంది. శివసేన (ఏక్‌నాథ్‌ శిందే వర్గం) నేతపై పోలీస్‌ కార్యాలయంలోనే భాజపా ఎమ్మెల్యే కాల్పులకు దిగిన సంగతి చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని