Maldives: మాల్దీవుల వ్యవహారం.. బలగాల స్థానంలో సాంకేతిక సిబ్బంది!

మాల్దీవుల నుంచి వైదొలగనున్న భారత బలగాల స్థానాన్ని సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు భారత విదేశాంగ తెలిపింది.

Published : 09 Feb 2024 01:35 IST

దిల్లీ: మాల్దీవుల (Maldives) నుంచి భారత బలగాలు వెనక్కి వచ్చేయనున్న విషయం తెలిసిందే. వారి స్థానాన్ని సమర్థులైన సాంకేతిక సిబ్బంది (Technical Personnel)తో భర్తీ చేయనున్నట్లు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు. బలగాల ఉపసంహరణ అంశంపై ఫిబ్రవరి 2న దిల్లీ వేదికగా ఇరుదేశాల మధ్య రెండో కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. మే 10 నాటికి భారత్‌ తన సైనిక సిబ్బందిని రెండు దశల్లో భర్తీ చేస్తుందని మాల్దీవుల విదేశాంగశాఖ తెలిపింది.

చైనాకు అనుకూల వ్యక్తిగా పేరున్న మహమ్మద్‌ ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. తమ దేశంలోని మూడు వైమానిక స్థావరాల్లో ఒకదానిలో విధులు నిర్వర్తిస్తోన్న బలగాలు మార్చి 10లోగా, మిగతా రెండు స్థావరాల్లోని దళాలు మే 10నాటికి వైదొలుగుతాయని ముయిజ్జు ఇటీవల వెల్లడించారు. భారత్‌కు చెందిన 80 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ ఉంటోంది. భారత్‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలు చూస్తోంది.

చైనా ముత్యాలసరంలో మాల్దీవులు

మాల్దీవుల అభివృద్ధికి భారత్ నిబద్ధతతో కూడిన భాగస్వామిగా కొనసాగుతుందని జైస్వాల్ మీడియా సమావేశంలో తెలిపారు. తాజా మధ్యంతర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. క్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ. 2023 బడ్జెట్‌లో ఆ దేశ అభివృద్ధికి రూ.400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా.. సవరించిన అంచనాల ప్రకారం రూ.770 కోట్లు ఖర్చు చేసింది. ఇరుదేశాలు కలిసి ముందుకెళ్లడంపై స్పష్టత వచ్చిన తర్వాత కొత్త కేటాయింపులను సవరించే అవకాశం ఉందని జైస్వాల్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని