Crime News: భర్తను చంపించి మహిళ నాటకం.. నిందితులను పట్టించిన మృతుడి సెల్‌ఫోన్

వివాహేతర సంబంధం మోజులో భర్తను అడ్డుతొలగించుకోవాలనుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి పథకం వేసింది. ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి ఆమె భర్తను చంపి, తగలబెట్టేశారు. ఘటన జరిగిన అయిదు నెలల

Updated : 23 Sep 2022 08:09 IST

 అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో కలిసి పన్నాగం

5 నెలల తర్వాత బట్టబయలు..

ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం మోజులో భర్తను అడ్డుతొలగించుకోవాలనుకున్న ఓ మహిళ ప్రియుడితో కలిసి పథకం వేసింది. ప్రియుడు, అతని స్నేహితుడు కలిసి ఆమె భర్తను చంపి, తగలబెట్టేశారు. ఘటన జరిగిన అయిదు నెలల తర్వాత మృతుడి సెల్‌ఫోన్‌ ఆధారంగా పోలీసులు గురువారం ఈ కుట్రను చేధించారు. నిందితులను ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచారు. కొత్తూరు సీఐ ఆర్‌.వేణుగోపాలరావు, హిరమండలం ఎస్సై జి.నారాయణస్వామి విలేకర్లకు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కుంబిరిక రాజు శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలంలోని చిన్నకొల్లివలసలో కొన్నేళ్ల కిందట స్థిరపడ్డాడు. హిరమండలానికి చెందిన సుజాతతో పదేళ్ల కిందట అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సుజాతకు పాడలి గ్రామానికి చెందిన బురళ్ల రాముతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తున్న రాజు ఈ ఏడాది ఏప్రిల్‌ 4న హిరమండలంలోని భార్య వద్దకు వచ్చాడు. అప్పటికే అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సుజాత, రాము.. ఎల్‌ఎన్‌పేట మండలం ధనుకోటకు చెందిన రాము స్నేహితుడు కె.నూకరాజుతో కలిసి పథకం వేశారు. ఏప్రిల్‌ 6న రాము, నూకరాజు.. రాజుతో కలిసి వంశధార నది పక్కన మద్యం తాగారు. రాజు అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఆటోలో ఎక్కించుకొని ఎల్‌ఎన్‌పేట సరిహద్దులో ఉన్న వంశధార కుడి ప్రధాన కాలువ గట్టుపైకి తీసుకెళ్లారు. ఆటో ఇంజిన్‌ స్టార్ట్‌ చేసే తాడును అతని మెడకు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని పొదల్లోకి విసిరేశారు.

పెట్రోల్‌ పోసి తగలబెట్టేయాలన్న భార్య

మృతదేహం ఉంటే ఎవరైనా గుర్తుపడతారని పెట్రోల్‌ పోసి తగలబెట్టాలని సుజాత సూచించడంతో వారిద్దరూ ఏప్రిల్‌ 7న రాత్రి మృతదేహం వద్దకు వెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అదే సమయంలో వర్షం కురవడంతో మృతదేహం పూర్తిగా కాలలేదని, కాలువలోకి తోసేశారు. కొద్దిరోజుల తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో సరుబుజ్జిలి పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సుజాత తన భర్త కనిపించడం లేదంటూ ఏప్రిల్‌ 22న హిరమండలం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి సెల్‌ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను విచారించారు. దీంతో తామే ఈ హత్యకు పాల్పడ్డామంటూ నిందితులు ముగ్గురూ లొంగిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని