logo

సామూహిక వివాహాలకు ఆదర్శం.. మహాగాం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాగాం గ్రామంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుంది. ఆ గ్రామంలోని సంత్‌ శ్రీ కోట్నక సురోజీ మహారాజ్‌ గురుదేవ్‌ సేవాశ్రమం పేద, గిరిజన కుటుంబాలకు బాసటగా నిలుస్తుంది.

Updated : 09 Mar 2024 06:41 IST

1971 నుంచి ఏటా నిర్వహణ
న్యూస్‌టుడే, సిర్పూర్‌(యు)

హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహాగాం గ్రామంలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుంది. ఆ గ్రామంలోని సంత్‌ శ్రీ కోట్నక సురోజీ మహారాజ్‌ గురుదేవ్‌ సేవాశ్రమం పేద, గిరిజన కుటుంబాలకు బాసటగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే ఆ ఆశ్రమం ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని తమ గురువు సంత్‌ శ్రీ కోట్నక సురోజీ మహారాజ్‌ చూపించిన మార్గంలో నడుస్తూ నేటికీ మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు.
ఎక్కడో మహారాష్ట్రలోని కిన్వాట్‌ తాలూకా సోనేగావ్‌ గ్రామంలో జన్మించిన సంత్‌ శ్రీ కోట్నక సురోజి మహారాజ్‌ మాహాగాం గ్రామానికి వచ్చి ఇక్కడి ప్రజలను మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంచుతూ వారిలో సేవా మార్గాన్ని నింపారు. గ్రామస్థుల కోరిక మేరకు గ్రామంలో 1950లో గుట్టపై శివాలయం, 1970లో సముదాయిక్‌ ప్రార్థన మందిరం నిర్మించారు. పేద, మద్య తరగతి కుటుంబాల యువతీ యువకులకు 1971 నుంచి మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని సామూహిక వివాహాలు జరిపించడానికి బీజం వేశారు. సురోజీ మహారాజ్‌ కాలం చేసిన తర్వాత కూడా ఆయన కోరిక మేరకు సేవాశ్రమం సభ్యులు వివాహాలు జరిపిస్తూ వస్తున్నారు. ఏటా గ్రామంలో సంస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక వివాహాలలో మహాశివరాత్రి రోజున నూతన వధూవరులను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా తయారు చేస్తారు. మరుసటి రోజు సామూహిక వివాహాలను నిర్వహిస్తారని సురోజిబాబా భక్తులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 520లకుపైగా జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించగా ఈ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని 12 జంటలకు సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు సేవాశ్రమం సభ్యులు తెలిపారు.


ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సాయం

ఆరేళ్ల నుంచి ఈ సామూహిక వివాహాలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి తాళిబొట్టు, మెట్టెలు, పట్టువస్త్రాలు, ఇతర సామగ్రి అందించగా, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. సేవాశ్రమం ఆదరణ చూసి వీరు కూడా తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు.


సేవా మార్గమే ప్రధానం

-ఆత్రం భీంరావు, సురోజీ మహారాజ్‌ భక్తుడు

సురోజీ మహరాజ్‌ చూపించిన మార్గంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నారు. సేవా మార్గం కంటే ఏదీ ఎక్కువ కాదు. నేటికీ ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాం.


గురువు చూపించిన మార్గంలో..

-మెస్రం కైలాష్‌, సురోజి మహారాజ్‌ సంస్థానం పీఠాధిపతి

సంత్‌ శ్రీసురోజీ మహరాజ్‌ చూపించని ఆధ్మాత్మిక మార్గాన్ని నేటికీ పాటిస్తున్నాం. ప్రతి ఒక్కరినీ ఆధ్మాత్మిక మార్గంలో నడిచేలా చేస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ సామూహిక వివాహాలు జరిపిస్తూ సురోజీ మహరాజ్‌ ఆశయాన్ని నెరవేరుస్తూ వస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని