logo

ఎల్‌ఆర్‌ఎస్‌.. నిబంధనలు తుస్‌

ఆదిలాబాద్‌లో ప్లాట్ల క్రమబద్ధీకరణలో అక్రమ దందా నడుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రభుత్వ అసైన్డ్‌ భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖలకు చెందిన భూముల్లో ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదని స్పష్టమైన ఆదేశాలున్నాయి.

Updated : 15 Mar 2024 05:35 IST

అసైన్డ్‌ భూముల్లోని ప్లాట్లకూ క్రమబద్ధీకరణ
న్యూస్‌టుడే ఆదిలాబాద్‌ పట్టణం

మావల మండలం బట్టిసావర్గాం శివారు పరిధిలోకి వచ్చే సర్వే నెం.72/3 లోని ఈ స్థలంలో కొన్ని రోజులుగా రహదారులు, మురుగు కాలువల నిర్మాణం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం కొత్తగా నిర్మించే జిల్లా సమీకృత భవన సముదాయం (కలెక్టరేట్‌ భవనానికి) ఆనుకొని ఉన్న పదెకరాల ఈ అసైన్డ్‌ భూమికి 13 ఏళ్ల కిందట ఆర్డీఓ నుంచి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ అయింది. ఆ తరువాత అదనపు పాలనాధికారి(జాయింట్‌ కలెక్టర్‌) ఆ ఎన్‌ఓసీని రద్దు చేశారు. అక్కడ క్రయవిక్రయాలు, ప్లాట్లు చేస్తే రెవెన్యూ అధికారులు పీఓటీ యాక్టు(ప్రొబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్స్‌) ప్రకారం స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారు. అయినా ఈ వివాదాస్పద భూమిలోని కొన్ని ప్లాట్లకు మాత్రం అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

దిలాబాద్‌లో ప్లాట్ల క్రమబద్ధీకరణలో అక్రమ దందా నడుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రభుత్వ అసైన్డ్‌ భూములు, దేవాదాయ, నీటి పారుదల శాఖలకు చెందిన భూముల్లో ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీగా ప్రభుత్వ అసైన్డ్‌ భూములు ఉన్నాయి. 1956 కంటే ముందు అసైన్డ్‌ చేసిన భూములకు ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) ఇవ్వడంతో దాన్ని సాకుగా చేసుకొని చాలామంది ప్లాట్లు చేసి విక్రయించారు. మరికొంత మంది నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించి ప్లాట్ల దందా సాగించారు. అసలు ఎన్‌ఓసీకి అర్హత లేని భూముల్లోనూ దర్జాగా ప్లాట్లు చేశారు. ఎన్‌ఓసీల జారీపై ఆరేడేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. ఎన్ని భూములకు జిల్లా అధికారులు ఎల్‌ఓసీ ఇచ్చారనేది స్పష్టత లేదు. మరికొందరు ప్రైవేటు పట్టాలు చూపించి ప్రభుత్వ భూముల్లో పాగావేసి అమ్మకాలు జరిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఈ సమస్య అధిగమించేందుకు ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ఎన్‌ఓసీ భూముల జాబితా ఇవ్వాలని అప్పటి పురపాలక కమిషనర్‌ శైలజ జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. కలెక్టర్‌ కార్యాలయం నుంచి మాత్రం ఎలాంటి జాబితా రాలేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వచ్చిన మొత్తం 19 వేల దరఖాస్తుల్లో 12 వేల వరకు ఎన్‌ఓసీ భూముల్లోని ప్లాట్లవే కావడం విశేషం. భూములపై వివాదాలు ఉండటంతో ప్రతి పత్రం, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సి ఉండగా అవేమి ఇక్కడ కనిపించడం లేదు. చెరువులకు 30 మీటర్ల దూరంలో, చిన్న చెరువులైతే 9 మీటర్లు, వాగులు, పెద్ద కాలువలైతే 9 మీటర్ల దూరంలో, చిన్న కాలువలకు 2 మీటర్ల దూరంలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయాలని నిబంధన ఉంది. ఎక్కడ వాగులు, కుంటలు ఉన్నాయనే వివరాలు నీటి పారుదల శాఖ అధికారుల నుంచి తీసుకోవాలి. పుర అధికారులు మాత్రం ఇవన్నీ గాలికొదిలేసి ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోదిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తాం..

-సాయికుమార్‌, పట్టణ ప్రణాళిక విభాగం సూపర్‌వైజర్‌

బట్టిసావర్గాం శివారు సర్వే నెం.72/3లోని లేవుట్‌లో కొన్ని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసిన మాట వాస్తవమే. అక్కడ తప్పు జరిగింది. ఆ ప్లాట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు కోసం గత కమిషనర్‌కు నివేదించాం. కొత్తగా వచ్చిన పుర కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లి రద్దు చేయిస్తాం.


రద్దు చేయడం కష్టమే

-ఎం.డి.ఖమర్‌హైమద్‌, పురపాలక కమిషనర్‌

ఒకసారి ఎల్‌ఆర్‌ఎస్‌ చేశాక రద్దు చేయడం చాలా కష్టం. ఆన్‌లైన్‌ విధానంలో దీన్ని ఆమోదిస్తారు. ఆన్‌లైన్‌లోనే రద్దు చేయాలి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం. వివాదాస్పద భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేశారంటే అది సిబ్బంది తప్పిదమే. దీనిపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని