logo

25 నుంచి సార్వత్రిక పరీక్షలు..

వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు.

Published : 24 Apr 2024 07:14 IST

జిల్లా కేంద్రంలోని జడ్పీ జన్కాపూర్‌ అధ్యయన కేంద్రంలో తరగతులు వింటున్న సార్వత్రిక ఎస్‌ఎస్‌సీ విద్యార్థులు

న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌ అర్బన్‌: వివిధ కారణాలతో ఆగిపోయిన చదువును ముందుకు సాగించడానికి తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) ఎంతగానో దోహద పడుతోంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల బాలలు పాఠశాల స్థాయిలో చదువును మానేస్తున్నారు. రెగ్యులర్‌ చదువులకు దూరమై డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. వయసుదాటిపోయి కనీస విద్యార్హతలు లేక వృత్తి, ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. ఉద్యోగాల్లో పదోన్నతులు అందుకోలేక పోతున్నారు. ఇలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టాస్‌ (సార్వత్రిక విద్య)ను అందుబాటులోకి తెచ్చింది. పాఠశాల చదువును ఆపేసిన వారికి ఎస్సెస్సీ, పదో తరగతి పూర్తి చేసిన వారికి ఇంటర్‌ చదువును అందిస్తోంది. పట్టణాలు, మండల కేంద్రాల్లోని పాఠశాలల్లో అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలు అందించి సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. తమ పనులు చేసుకుంటూనే రెండో శనివారం, ఆదివారాల్లో తరగతులకు హాజరవుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి ఇందులో చేరిన వారికి ఈ నెల 25వ తేదీ నుంచి తుది పరీక్షలు నిర్వహించనుంది. జిల్లాలో ఈ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే రెగ్యులర్‌ చదువులకు సమానార్హత గల ధ్రువపత్రాలు జారీ చేస్తారు. 

జిల్లాలో 19 అధ్యయన కేంద్రాలు ఉండగా.. 440 మంది ఎస్సెస్సీ, 320 మంది ఇంటర్‌ ప్రవేశం పొందారు. అధ్యయన తరగతులకు హాజరై ఈ నెల 25వ తేదీ నుంచి మే నెల 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల్లో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి, విద్యుత్తు, వైద్యం, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని పాలనాధికారి సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు.


ఏర్పాట్లు ఇలా..

జిల్లాలో నిర్వహించనున్న సార్వత్రిక ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షల కోసం నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ కేంద్రాల్లో రెండేసి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎస్సెస్సీ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరవనుండగా.. రెండు కేంద్రాలు, ఇంటర్‌ పరీక్షకు 320 మంది అభ్యర్థుల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి సీఎస్‌, డీవోలు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రతి రోజూ రెండు పేపర్లు నిర్వహిస్తారు. మే 3-10 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


అయిదు నిమిషాల నిబంధన

పార్శి అశోక్‌, జిల్లా విద్యాశాఖాధికారి

టాస్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష సమయానికి గంటముందే కేంద్రానికి చేరుకోవాలి. అయిదు నిమిషాలకు మించి ఆలస్యమైతే కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షల్ని పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నాం. వేసవి దృష్ట్యా కేంద్రాల్లో ఫ్యాన్లు, తాగునీటి వసతి, వైద్య సిబ్బందితో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని