logo

విజ్ఞాన భాండాగారం.. అంతర్జాలం

దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి, హడావుడి నడుస్తుండగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల కాలం ముందుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పోటీ పడుతుండగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

Published : 06 May 2024 04:46 IST

ఖానాపూర్‌, న్యూస్‌టుడే : దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి, హడావుడి నడుస్తుండగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల కాలం ముందుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పోటీ పడుతుండగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గతంలో పోటీ పరీక్షలకు గ్రంథాలయాల్లో యువత పుస్తకాల కోసం పోటీపడేవారు. ప్రస్తుత ప్రపంచంలో విజ్ఞానానికి అంతర్జాలం అండగా నిలుస్తోంది. ఒక్క క్లిక్‌తో బోలెడంత సమాచారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న టెట్‌, డీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. వీరికోసం అంతర్జాలంలో ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ అనేక పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగుతో పాటు అనేక భాషల్లో పుస్తకాలు అందులో ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికతో చదవడమే కాకుండా పరీక్షల్లో వచ్చే సిలబస్‌కు సంబంధించిన విషయ పరిజ్ఞానం అవసరం. దీంతో పుస్తకాలు అందుబాటులో లేనివారు, నిరుపేద విద్యార్థులు, అభ్యర్థులకు ఈ వెబ్‌సైట్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ(ఎన్‌సీఈఆర్టీ) రూపొందించిన వివిధ పాఠ్యాంశాలు, పలు విశ్వవిద్యాలయాల పరిశోధనల వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం కావాలో దానిపై క్లిక్‌ చేస్తే ఆయా పాఠ్యాంశాల పేజీలు ప్రత్యక్షమవుతాయి. మొత్తం 68 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉండగా 38 వేల పరిశోధన వ్యాసాలున్నాయి. సమాచారాన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్డీఐ.కామ్‌ లేదా ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ పేరిట గూగుల్‌లో సమాచారం పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని